ప్రభుత్వ ఉత్తర్వు చట్టం కాదు | AP BC Reservations Supreme Court Verdict | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉత్తర్వు చట్టం కాదు

Oct 13 2026 3:06 AM | Updated on Oct 13 2026 3:06 AM

AP BC Reservations Supreme Court Verdict

సందర్భం

తమిళనాడు తన 69 శాతం రిజర్వేషన్‌ను ఒక చట్టం ద్వారా, రాష్ట్రపతి ఆమోదంతో, తొమ్మిదవ షెడ్యూలును అనుసరించి కాపాడుకుంది. ఆంధ్రప్రదేశ్‌ అందుకు భిన్నంగా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులకే పరిమితమై, న్యాయస్థానాల నిరాకరణకు గురయింది. 

2026 అక్టోబర్‌ 9న సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఎస్‌.ఎల్‌.పి.(సి) నెం. 35539/2026ను కొట్టివేసింది. దీంతో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులకు 34 శాతం రిజర్వేషన్‌ను కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా కాపాడే ప్రయత్నం ముగిసింది. జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ షీల్‌ నాగు ధర్మాసనం హైకోర్టు తీర్పు సమంజసమైనదని పేర్కొంటూ, రాష్ట్ర ఏకీకృత కుటుంబ సర్వేను అసలు ఏ చట్టం కింద నిర్వహించారని ప్రశ్నించింది. నాకు ఆశ్చర్యం కలగలేదు. రాజ్యాంగ రక్షణ ఉన్న చట్టం మాత్రమే చేయగలిగిన పనిని ప్రభుత్వ ఉత్తర్వు చేయలేదని నేను ఏళ్లుగా చెబుతున్నాను.

కోర్టులు ఏం తీర్పు చెప్పాయి?
2026 అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ (ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌).. కె. కృష్ణమూర్తి (2010), వికాస్‌ కిషన్‌రావు గవాలి (2021) తీర్పులను వర్తింపజేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్‌లు కలిపి 50 శాతం మించిన మేరకు జి.వో. ఎం.ఎస్‌. నెం. 105 (గ్రామీణ, 20.08.2026), జి.వో. ఆర్‌.టి. నెం. 1065 (పట్టణ, 19.08.2026) లను రద్దు చేసింది. రాష్ట్ర న్యాయవాదే మొత్తం రిజర్వేషన్లు గ్రామీణ సంస్థలలో 61.08 శాతం, పట్టణ సంస్థలలో 49.24 శాతం అని పేర్కొన్నారు.

ఈ గణాంకాల ప్రకారం గ్రామీణ బీసీ కోటా 34 శాతం నుండి సుమారు 23 శాతానికి తగ్గుతుంది. బిర్రు ప్రతాప్‌ రెడ్డి (2020) తీర్పు తర్వాత 2021 ఎన్నికలు జరిగింది సరిగ్గా ఈ స్థాయిలోనే. పట్టణ సంస్థలలో మాత్రం మూడో వంతు కోటా నిలిచింది. బీసీలు 50.42 శాతం అని చెప్పే సర్వే, గవాలి తీర్పు కోరే ప్రత్యేక కమిషన్‌ విచారణకు ప్రత్యామ్నాయం కాదని కోర్టు తేల్చింది. ఆ కమిషన్‌ నివేదికను కనీసం ఆమోదించను కూడా లేదని గమనించింది. సరైన డేటాతో తిరిగి రావటానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చింది.

తెలిసీ చేసిన తప్పుడు వాగ్దానం!
ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో సగానికి పైగా వెనుకబడిన తరగతులే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ 16 మంది లోక్‌సభ సభ్యులతో వెన్నెముక. అంతటి బలమున్న పార్టీ ఆర్టికల్‌ 31–సి కింద అసెంబ్లీ చేత చట్టం చేయించి, రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్‌ చేసి, ఆర్టికల్‌ 31–బి కింద తొమ్మిదవ షెడ్యూలులో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించి ఉండవచ్చు. అప్పుడు మాత్రమే 50 శాతాన్ని మించి రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యమయ్యేది. అలా కాకుండా ఏపీ, తెలంగాణ హైకోర్టు తీర్పులకు, గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు నిలవవని పూర్తిగా తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు వాగ్దానం చేసింది.

తమిళనాడు 1990 నుండి 69 శాతం రిజర్వేషన్‌ ఇస్తోంది. 50 శాతం పరిమితి వచ్చిన తర్వాత అక్కడి పార్టీలు విషయాన్ని కోర్టులకే వదిలేయలేదు. 1992 నవంబర్‌ 24న సమావేశమ య్యాయి. 1993 నవంబర్‌ 6న సామాజిక న్యాయ సమావేశం నిర్వహించాయి. 1993 డిసెంబర్‌లో అసెంబ్లీ, ఆర్టికల్‌ 31–సి కింద బిల్లు ఆమోదించింది. ఆ చట్టం 1994 జూలై 19న నోటిఫై అయింది. పార్లమెంట్‌ 1994 ఆగస్టు 24, 25 తేదీల్లో 76వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. తమిళనాడు రాష్ట్రం ఆర్టికల్‌ 31–సి కింద చేసిన చట్టాలకు రాష్ట్రపతి 1994 సెప్టెంబర్‌ 1న ఆమోదం తెలిపి, ఆర్టికల్‌ 31–బి కింద వాటిని తొమ్మిదవ షెడ్యూలలో ఎంట్రీ 257–ఎ గా చేరుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రత్యర్థులు కలిసి నడిచారు.

ఆర్టికల్‌ 342–ఎ(3) కింద రాష్ట్ర జాబితా
2021లో వచ్చిన 105వ రాజ్యాంగ సవరణ నుండి, ఆర్టికల్‌ 342–ఎ(3) ప్రతి రాష్ట్రానికీ తన అవసరాల కోసం, కేంద్ర జాబితాకు భిన్నమైన నమోదులతో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల జాబితాను సిద్ధం చేసి నిర్వహించే అధికారం ఇస్తోంది. ఆలిండియా బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ (డబ్లు్య.పి. నెం. 36399 ఆఫ్‌ 2025) ఇంకా పెండింగులో ఉంది.

స్థానిక సంస్థలు, ప్రవేశాలు, పోస్టులు– సర్వీసులు, సంక్షేమ చర్యలు అనే అన్ని రాష్ట్ర అవసరాల కోసం అటువంటి జాబితాను సిద్ధం చేసి నిర్వహించాలని, 2023లో ప్రారంభించిన కుల, సామాజిక–విద్యా సర్వేను పూర్తి చేయాలని రాష్ట్రాన్ని ఆదేశిస్తూ మాండమస్‌ ఇవ్వమని అది కోరుతోంది. 2014–19 సర్వే ఫలితాల్లాగే దాని ఫలితాలను కూడా ప్రచురించలేదు. ఆర్టికల్‌ 15(4), 16(4), 243–డి(6), 243–టి(6)ల కింద రిజర్వేషన్‌.. డేటా ఆధారంగా గుర్తించిన తరగతిపై నిలుస్తుంది కాబట్టి ఈ జాబితా ఉపయోగకరం. అన్ని బీసీ వర్గాలను ఒకే బ్లాక్‌గా పరిగణించినప్పుడు ప్రాతినిధ్యం దక్కని అత్యంత వెనుకబడిన వర్గాలైన సంచార, అర్ధ–సంచార, విముక్త జాతులను ఇది లోపలికి తెస్తుంది.

చట్టం, రాష్ట్రపతి ఆమోదం, తొమ్మిదవ షెడ్యూలు.. ఏ జనాభా వెనుకబాటుతనాన్ని గణాంకాలపై నిర్మించాలో వాటిని అందిస్తుంది. 50 శాతం పరిమితిని దాటాలంటే ఆర్టికల్‌ 342–ఎ(3) కింద సమకాలీన, కచ్చితమైన డేటా అవసరం. దాని ఆధారంగా ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల వారీగా ఒక ప్రత్యేక కమిషన్‌ నిర్ధారించి, తమిళనాడు మాదిరిగా తగిన చట్టం ద్వారా రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు మాత్రమే 50 శాతం పరిమితికి మించిన రిజర్వేషన్లకు రక్షణ లభిస్తుంది.

ఆర్టికల్‌ 342–ఎ(3) కింద సిద్ధం చేసి నిర్వహించే (సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులపై) వాస్తవ ఇంటింటి సర్వే / విచారణ లేకుండా, తమిళనాడు మాదిరిగా రాజ్యాంగ సవరణ ద్వారా తప్ప, ఏ రిజర్వేషనూ 50 శాతం మించరాదు. లేదంటే, వికాస్‌ కిషన్‌రావు గవాలి కేసులో చెప్పిన ట్రిపుల్‌ టెస్ట్‌ సంతృప్తి చెందకుండా 50 శాతం రిజర్వేషన్లను కూడా కాపాడలేము. వికాస్‌ కిషన్‌రావు గవాలి కేసులో ఎన్నికలను రద్దు చేశారు. 50 శాతం లోపు జరిగిన ఎన్నికలనూ రద్దు చేసి, ఓపెన్‌ కేటగిరీ కింద తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

లోపించిన నిబద్ధత
ఆంధ్రప్రదేశ్‌ అఖిలపక్ష అసెంబ్లీ తీర్మానం చేసి, ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపడం ద్వారా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌ చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలి. రాష్ట్ర చట్టానికి పార్లమెంట్‌ ఆమోదం కోసం ఒత్తిడి చేసి, ఆర్టికల్‌ 31–బి కింద రక్షణ కోసం ఆ రాష్ట్ర చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూలులో చేర్చటానికి రాష్ట్రపతి ఆమోదాన్ని కోరాలి. ఈలోగా ఆర్టికల్‌ 342–ఎ(3) కింద విచారణ జరిపి సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాను సిద్ధం చేయాలి.

గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పోరేషన్‌ల వారీగా తగిన రిజర్వేషన్లు ఇవ్వటానికి ఓబీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించమని ప్రత్యేక కమిషన్‌ను కోరాలి. చర్యలను సమర్థించుకోవటానికి బదులు, సంబంధిత పార్టీలనూ కలిసి శాసనం చేసి, తమిళనాడు చట్టం మాదిరిగా రాజ్యాంగ రక్షణ కోసం భారత రాష్ట్రపతి ఆమోదం పొందాలి. మన నాయకులకు పార్లమెంటులో సంఖ్యాబలం ఉంది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయంలో లోపించింది... సంకల్పం, నిబద్ధత, దృఢనిశ్చయమే. 
- జస్టిస్‌ వి. ఈశ్వరయ్య (రిటైర్డ్‌), వ్యాసకర్త జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, దమాజీ చైర్‌పర్సన్, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement