బెంగళూరు: నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా రగులుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు న్యాయం జరగాలంటూ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ఆందోళనకు ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడమే కాకుండా స్వయంగా హాజరుకావడం సంచలనంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
‘ఎక్స్’ వేదికగా ప్రకాష్ రాజ్ పిలుపు
గతంలో ఢిల్లీలో జరిగిన నిరసనకు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన నటుడు ప్రకాష్ రాజ్, ఈసారి బెంగళూరు ధర్నాలో పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ప్రభుత్వం తన వైఫల్యాలకు బాధ్యత వహించేలా మనమంతా గొంతు ఎత్తాలని, ఈ శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విధానాలను నిరంతరం విమర్శించే ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమంలో చేరడంతో జెన్ జెడ్ నేతృత్వంలోని ఈ విద్యార్థి ఉద్యమానికి మరింత బలం చేకూరినట్లయింది.
దేశవ్యాప్తంగా ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు
గత వారం రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని పలు నగరాల్లో వరుస ఆందోళనలతో హోరెత్తిస్తోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శనతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. ఆ తర్వాత పుణె, లక్నో, అమృత్‌సర్ నగరాలకు పాకింది. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగే నిరసనలో ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థ కుప్పకూలిందని, కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుతోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూన్ 20న 'ఢిల్లీ చలో'..
ఈ పోరాటాన్ని ఇంతటితో ఆపబోమని, జూన్ 20న దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు అక్కడే తిష్ట వేస్తామని సీజేపీ ప్రతినిధి దిప్కే స్పష్టం చేశారు. పుణె నిరసనలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీకి దేశంలోని ఒక కోటి మంది విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా, లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కాక్రోచ్ ముసుగులు ధరించి, చేతుల్లో పూలు పట్టుకుని వినూత్న రీతిలో చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


