ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నానా పటేకర్ మరణం సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు సానుభూతి తెలిపారు. ‘ఓం శాంతి’ అంటూ నివాళులర్పించారు.
‘‘కొద్దిమంది నటులకే ఉండే తీవ్రత, ప్రత్యేకత, చెరగని ఉనికి నానా పటేకర్‌గారి సొంతం. ప్రతి పాత్రలోనూ ఆయన అద్భుతమైన వైవిధ్యం, సృజనాత్మకతను ప్రదర్శించారు. తరతరాలు గుర్తుంచుకునే పాత్రలను మనకు అందించారు’’ అని మోదీ పేర్కొన్నారు. నానా పటేకర్ తన నటనతోనే కాకుండా నిర్మొహమాటమైన, ముక్కుసూటి అభిప్రాయాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని అన్నారు. తాను నమ్మిన విషయాలను చెప్పేందుకు ఆయన ఎప్పుడూ వెనుకాడేవారు కాదని కొనియాడారు.
‘హిందీ, మరాఠీ సినిమాకు అపార సేవ’
హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలకు నానా పటేకర్ చేసిన సేవలు అపారమని మోదీ పేర్కొన్నారు. ఆయన మరణం సినీ ప్రపంచంలోనూ, ఆయనను అభిమానించే కోట్లాది మందిలోనూ తీరని లోటును మిగిల్చిందన్నారు. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Few actors possessed the intensity, individuality and unmistakable presence that Shri Nana Patekar Ji had. He brought remarkable versatility and creativity to every role and gave us characters that will be remembered for generations. He was also admired for his frank and forthright views, never hesitating to express what he believed in. Shri Nana Patekar’s contribution to Hindi and Marathi cinema was immense. His passing leaves a deep void. My condolences to his family, friends and countless admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) October 8, 2026
గుండెపోటుతో కన్నుమూత
నానా పటేకర్ గురువారం ఉదయం గోవాలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ స్పందించలేదు. ఉదయం 5.20 గంటల సమయంలో ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన వయసు 75 సంవత్సరాలు.
రంగస్థలం నుంచి వెండితెర వరకు..
విశ్వనాథ్ పటేకర్‌గా జన్మించిన నానా.. 1978లో వచ్చిన ‘గమన్’ సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించారు. ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘అగ్ని సాక్షి’, ‘వెల్‌కమ్’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేశారు. ‘క్రాంతివీర్’(తెలుగులో మోహన్‌బాబు నటించిన పుణ్యభూమి నా దేశం) చిత్రానికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ‘అగ్ని సాక్షి’కి ఉత్తమ సహాయ నటుడిగా మరో జాతీయ పురస్కారం దక్కింది.
నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. 1991లో ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంగస్థల నటుడిగానూ ఆయనకు విశేష గుర్తింపు ఉంది. కళారంగానికి చేసిన సేవలకు 2013లో పద్మశ్రీ పురస్కారం లభించింది.
నానా పటేకర్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా నానా పటేకర్ మృతి కళా ప్రపంచానికి పూడ్చలేని లోటని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తదితరులు ఆయనకు నివాళులర్పిస్తూ.. భారతీయ సినిమా, సామాజిక సేవకు నానా చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
ఇదీ చదవండి: కాస్ట్‌లీ కారును వద్దనుకుని.. రైతులకు సాయం


