ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇండియా కూటమి సిద్ధమైంది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఓట్ల అక్రమాల ఆరోపణలపై సోమవారం సుప్రీంకోర్టు దిశగా మార్చ్ చేపట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. మరోవైపు, ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న చట్టాన్ని సవాలు చేసే అంశంపైనా దృష్టి సారించాయి.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ను నిలిపివేయాలని రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఎన్నికల కమిషనర్లకు విధుల నిర్వహణకు సంబంధించి చట్టపరమైన రక్షణ కల్పించే 2023 నాటి చట్టంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. ఈ రక్షణ వల్ల ఎన్నికల కమిషనర్లను జవాబుదారీగా నిలబెట్టడం కష్టమవుతుందని ఆయన విమర్శించారు. ఓట్ల చోరీ, ఈవీఎంలలో అవకతవకలు, ఎన్నికల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
చట్టంలో ఏముందంటే..
2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలానికి సంబంధించిన చట్టంలోని సెక్షన్ 16 ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. దీని ప్రకారం.. వారు తమ అధికారిక విధులు నిర్వహిస్తున్నప్పుడు లేదంటే విధుల్లో భాగంగా వ్యవహరిస్తున్నట్లు భావించే సందర్భాల్లో చేసిన చర్యలు, పనులు/ మాట్లాడిన మాటలకు సంబంధించి వారిపై సివిల్, క్రిమినల్ కేసులను కోర్టులు విచారణకు స్వీకరించకూడదు. ఇప్పటికే విచారణలో ఉన్న కేసులనూ కొనసాగించకూడదు. ఈ నిబంధన వల్ల ఎన్నికల కమిషనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రక్షణ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.
చట్టపరమైన రక్షణపైనే గురి
ఎన్నికల కమిషనర్లకు అధికారిక విధుల నిర్వహణలో చేసిన చర్యలకు సంబంధించి చట్టపరమైన రక్షణ కల్పించే నిబంధనలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనలు ఎన్నికల కమిషనర్ల జవాబుదారీతనాన్ని బలహీనపరుస్తాయన్నది వాటి వాదన. ఈ చట్టాన్ని సవాలు చేసే న్యాయపరమైన మార్గాలపై దృష్టి పెట్టడం ద్వారా రాజకీయ నిరసనలతోపాటు న్యాయస్థానంలోనూ తమ పోరాటాన్ని కొనసాగించాలని ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల సంఘంలో సీఈసీ నియామక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడంపైనా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్‌గా ప్రసారం చేసే పోస్టల్ బ్యాలెట్ విధానం (ఈటీపీబీఎస్) ద్వారా ఓట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా తమ వినతిపత్రంలో ప్రస్తావించనున్నాయి.
రాష్ట్రపతి తర్వాత సీజేఐ, కానీ..
ఇండియా కూటమి నేతలు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ ఆరోపణలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు. అయితే, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ భేటీకి అంగీకరించలేదని, బదులుగా పిటిషన్ దాఖలు చేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. దీంతో వినతిపత్రం ద్వారా తమ అభ్యంతరాలను తెలియజేయాలన్న ప్రయత్నం న్యాయపరమైన చర్యల దిశగా మళ్లుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ ఎంపీలంతా ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని పార్టీ ఆదేశించింది. గోవా పర్యటనను వాయిదా వేసుకున్న రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. అక్టోబర్ 6న పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు చేపట్టిన మార్చ్ సందర్భంగా రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనతో మొదలైన ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో నేడు మళ్లీ ఆంక్షలు
మరోవైపు, ప్రతిపక్షాల మార్చ్ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటేల్ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, బరాఖంబా రోడ్ మెట్రో స్టేషన్లలో ప్రవేశం, బయటకు వెళ్లే మార్గాలను మూసివేశారు. అయితే, ఈ స్టేషన్లలో మెట్రో మార్పిడి సదుపాయం అందుబాటులో ఉంటుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు హెచ్చరించారు.
ఇటీవల నిరసనల సందర్భంగా మెట్రో, రైలు సేవలకు అంతరాయం కలగడం, నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని చట్ట ప్రక్రియకు విరుద్ధంగా అదుపులోకి తీసుకోవద్దని, ప్రజా రవాణా సేవలు సాధారణంగా కొనసాగించేలా చూడాలని ఆదేశించింది. మెట్రో స్టేషన్ల మూసివేతపై అధికారులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఆంక్షలు, విపక్షాల మార్చ్ ఢిల్లీలో రాజకీయంగా కీలకంగా మారాయి.
ఇదీ చదవండి: వ్యక్తిగతంగా కలవడం కుదరదు: ఇండి కూటమితో సీజేఐ సూర్యకాంత్!


