సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ షాక్ ఇచ్చారు. తనను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరిన ప్రతిపక్ష నేతలకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. తాము లేవనెత్తాలనుకుంటున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, వాటిపై ఫిర్యాదులు లేదంటే అభ్యంతరాలు ఉంటే పిటిషన్ దాఖలు చేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఓట్ల తొలగింపు తదితర అంశాలపై నిరసన తెలియజేసేందుకు ఇండియా కూటమి సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీజేఐని కలిసి వినతిపత్రం అందజేయాలని ప్రతిపక్ష నేతలు ప్రయత్నించారు. అయితే, అపాయింట్‌మెంట్ నిరాకరణతో వారి ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ విధంగా పరిపాలనా స్థాయిలో కలవడానికి కోర్టుకు అధికారం లేదని ఆయన స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి.
తలుపులు తెరిచే ఉంటాయ్
సుప్రీంకోర్టు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమని, దాని తలుపులు ప్రజలందరికీ 24 గంటలూ తెరిచే ఉంటాయని సీజేఐ పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు న్యాయస్థానం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రాజకీయ ప్రతినిధులను ప్రత్యేకంగా కలిసి వినతులు స్వీకరించడం కంటే, న్యాయపరమైన మార్గంలో పిటిషన్ దాఖలు చేస్తే విచారించి తీర్పు ఇవ్వడం కోర్టు విధి అని ఆయన అభిప్రాయపడినట్లు తెలిపాయి.
నేడు సుప్రీంకోర్టు వరకు మార్చ్
సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరించినప్పటికీ, సోమవారం సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించాలనే యోచనలో ఇండియా కూటమి ఉన్నట్లు సమాచారం. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదని, దేశ ప్రజలందరికీ సంబంధించినదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణను కోరుకునేవారంతా ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సీజేఐని కలిసేందుకు సమయం కోరినట్లు సమాచారం.
నాలుగు ప్రధాన డిమాండ్లు
ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న ఇండియా కూటమి.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం అందజేసింది. అందులో నాలుగు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించింది.
1. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పించే 2023 చట్టాన్ని రద్దు చేయాలి.
2. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, తొలగించినట్లు చెబుతున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలి.
3. అన్ని ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి.
4. గత రెండేళ్లలో ఓట్ల చోరీకి సంబంధించి నిర్దిష్ట ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలి.
ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. అయితే, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను ఎన్నికల సంఘం, బీజేపీ ఖండిస్తున్నాయి.
పోలీసుల చర్యలపైనా విచారణ
ఢిల్లీలో నిరసనలు, పోలీసుల చర్యలపై కూడా వివాదం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంస్థ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం సుమారు 3,000 మందిని నిర్బంధించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆదివారం కూడా ఢిల్లీతోపాటు ముంబై సహా పలు నగరాల్లో నిరసనలు కొనసాగాయి.
పోలీసుల చర్యలు, మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, నిరసనకారుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందన్న ఆరోపణలకు సంబంధించి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలపై మంగళవారం విచారణ జరగనుంది. మరోవైపు, ఓటర్ల జాబితా సవరణ చట్టబద్ధతను సుప్రీంకోర్టు గత మే నెలలో సమర్థించినప్పటికీ, దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో పేర్లు తొలగించడంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
ఇండియా కూటమి తీరుపై బీజేపీ విమర్శలు
సీజేఐని కలిసి వినతిపత్రం అందజేయాలన్న ప్రతిపక్షాల నిర్ణయాన్ని బీజేపీ ఇప్పటికే తప్పుబట్టింది. రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రధాన న్యాయమూర్తులు ప్రత్యేకంగా కలవడం సంప్రదాయం కాదని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు కేసులు వేయడం ద్వారా ప్రభుత్వాలను నిర్ణయించలేరని, ఎన్నికల ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరణ ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై ఆసక్తిని పెంచింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ ఆరోపణలపై పోరాడుతారా? లేక నిరసనల ద్వారా రాజకీయ ఒత్తిడిని మరింత పెంచుతారా? అనేది వేచి చూడాలి.
ఇదీ చదవండి: నిరసన హక్కును హరిస్తారా?


