నిరసన హక్కును హరిస్తారా?  | No Illegal Detention Of Peaceful Protesters says Supreme Court | Sakshi
Sakshi News home page

నిరసన హక్కును హరిస్తారా? 

Oct 12 2026 6:01 AM | Updated on Oct 12 2026 6:01 AM

No Illegal Detention Of Peaceful Protesters says Supreme Court

నిరాయుధులను నిర్బంధించడం తగదు  

ఢిల్లీలో మెట్రో రైలు, ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించాలి  

ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం  

సాక్షి, న్యూఢిల్లీ: దేశ పౌరుల శాంతియుత నిరసన హక్కును హరించడం, నిరాయుధులైన ఆందోళనకారులను అక్రమంగా నిర్బంధించడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఈసీ జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలను అణిచివేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. నలుగురు మాజీ ముఖ్యమంత్రులను పోలీసులు ముందస్తుగా నిర్బంధించడాన్ని సవాలు చేయడంతోపాటు ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్ల మూసివేతపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు ద్విసభ్య ఆదివారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.

 చట్టప్రకారం ఎవరినీ అక్రమంగా నిర్బంధించడానికి వీల్లేదని, నిరసనలను అడ్డుకునే పేరుతో ప్రజా రవాణా, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం సమర్థనీయం కాదని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం తేల్చిచెప్పింది. శాంతియుతంగా గుమిగూడే ప్రజలను చట్టవిరుద్ధంగా నిర్బంధించకూడదని వెల్లడించింది. శాంతిభద్రతల పరిస్థితులకు లోబడి ఢిల్లీ మెట్రో సేవలు సజావుగా సాగేలా, ఇంటర్నెట్‌ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ఆయా సేవలను వెంటనే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. 

సుప్రీంకోర్టు పరిసరాల్లో విధించిన బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 ఆంక్షల బోర్డులను తక్షణమే తొలగించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. న్యాయస్థానాలకు పౌరులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా చూడాలని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 19(2) ప్రకారం తీవ్రమైన శాంతిభద్రతల సమస్య ఉంటే తప్ప రైల్వే సేవలను నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. ట్రాఫిక్‌ నిబంధనలకు లోబడి పౌరులు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించాలని, బారికేడ్ల ఏర్పాటును తక్షణం సమీక్షించాలని పోలీసులకు స్పష్టం చేసింది. 

ఎమర్జెన్సీ తరహా వాతావరణం 
విచారణ సందర్భంగా పిటిషన్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్, గోపాల్‌ శంకర్‌ నారాయణ్, సంజయ్‌ హెగ్డే, మేనకా గురుస్వామి, షాదాన్‌ ఫరాసత్‌ పోలీసుల దౌర్జన్యాలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీలో దాదాపు 7,000 మందిని అరెస్టు చేశారని, 45 నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, మాణిక్‌ సర్కార్‌ను ముందస్తుగా నిర్బంధించారని, అసలు అరెస్టులకు సంబంధించిన అధికారిక లెక్కలు చెప్పడం లేదని పేర్కొన్నారు. రాజధానిలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందా? అని ప్రశ్నించారు.

 రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని, జంతర్‌మంతర్‌ పరిసరాలకు ఏకంగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నవారినీ  పోలీసులు అరెస్టు చేశారని సిబల్‌ ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 45 మెట్రో స్టేషన్లను మూసివేశారని, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని పేర్కొన్నారు. నిరసనల ప్రాంతంలో ఉన్న తనను పోలీసులు దారుణంగా కొట్టి, కదులుతున్న బస్సులోకి విసిరేశారని న్యాయవాది షాదాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పోలీసు రాజ్యం నడుస్తోందనే భావన కలిగిందని అన్నారు. పోలీసులు కనీసం నేమ్‌ బ్యాడ్జీలు లేకుండా విధులు నిర్వహించారని, నిరాయుధులైన పిల్లలను పాశవికంగా కొట్టారని లాయర్‌ గోపాల్‌ తెలిపారు.

కోర్టు ధిక్కరణ నోటీసులు  
సుప్రీంకోర్టు అక్టోబర్‌ 9న ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్, డీఎంఆర్‌సీ చైర్‌పర్సన్‌ తారపై న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆ అధికారులకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. రైల్వే సేవలు యథాతథంగా కొనసాగుతున్నాయని, శనివారం రాత్రి 10 గంటల నుంచి అన్ని మెట్రో స్టేషన్లు తెరిచే ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం.. మంగళవారం నాటికి నివేదిక (కంప్లయన్స్‌ రిపోర్ట్‌) సమర్పించాలని అధికారులను ఆదేశించింది. న్యాయవాదులు, పాత్రికేయులు, ఇతరులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించడంలో ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోకుండా చూడాలని తేల్చిచెప్పింది. తదుపరి విచారణలో ఈ వ్యవహారాన్ని లోతుగా సమీక్షిస్తామని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement