ఎనిమిది నెలల పాటు చెమటోడ్చాడు.. టన్నుల కొద్దీ చెత్తను ఒక్కడే తొలగించాడు.. నదికి కొత్త రూపు తెచ్చాడు! కానీ, అతడి కష్టం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. కొద్ది వారాలకే నది మళ్లీ చెత్తకుప్పగా మారింది. తన శ్రమంతా వృథా కావడంతో గుండె పగిలినా.. 20 ఏళ్ల బిట్టూ తబాహీ వెనక్కి తగ్గలేదు. ఈత కూడా రాని ఆ యువకుడు మరోసారి నదిలోకి దిగి చెత్తను ఏరివేయడం మొదలుపెట్టాడు.
మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది వద్ద ఈ హృదయవిదారక దృశ్యం కనిపించింది. సురేంద్ర సింగ్ చౌధరీ అలియాస్ బిట్టూ తబాహీ.. ఎనిమిది నెలల పాటు ఒంటరిగా శ్రమించి నదిలోని టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించాడు. కానీ, ప్రజలు మళ్లీ చెత్త వేయడంతో కొద్ది వారాల్లోనే నది పాత స్థితికి చేరింది. ఈ పరిస్థితిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నాడు.
అయినా, నిరుత్సాహంతో ఆగిపోలేదు. ఈత రాకపోయినా నదిలోకి దిగి మరోసారి చెత్తను తొలగించడం ప్రారంభించాడు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యర్థాలను తొలగించేందుకు మార్గాలు సూచించాలని తన ఫాలోవర్లను కోరాడు.

అలా ఫేమస్ అయ్యి..
బిట్టూ తబాహీ.. స్థానికంగా ఓ ఆలయం సమీపంలోని చెరువు చెత్తతో నిండిపోవడం చూసి శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అజ్నార్ నదిపై దృష్టి పెట్టాడు. 2026 జనవరి 26న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో తొలుత కొందరు స్నేహితులు తోడైనా.. ఎక్కువ భాగం పనిని ఒక్కడే చేశాడు. తన సొంత డబ్బును ఖర్చు చేస్తూ, ప్రత్యేక పరికరాలు లేకుండానే ప్లాస్టిక్ సంచులు, సీసాలు, బురద, ఇతర వ్యర్థాలను తొలగించాడు. ఈ క్రమంలో చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి ఇబ్బందులనూ ఎదుర్కొన్నాడు.
బిట్టూ శ్రమకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా అతడి కృషిని అభినందించారు. ఆ తర్వాత బెంగళూరులోని తురహళ్లి అడవిని 100 మందితో కలిసి శుభ్రం చేశాడు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలోనూ శుభ్రతా కార్యక్రమాలు చేపట్టి గురుగ్రామ్‌లో యుమనా నది నుంచి ఏకంగా 2,435 కిలోల వ్యర్థాలను తొలగించాడు.
ఒక్కడి బాధ్యతేనా?
నదిని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో.. మళ్లీ చెత్త వేయకుండా చూడటం కూడా అంతే అవసరం. బిట్టూ ప్రయత్నాలకు సోషల్ మీడియాలో పలువురు మద్దతు తెలిపారు. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ వ్యవస్థాపకుడు బోయన్ స్లాట్ నుంచి ఉద్యోగ అవకాశం కూడా వచ్చింది. అయినప్పటికీ, ఇక్కడే ఉండి తన స్వచ్ఛ్ భారత్‌ను కొనసాగిస్తున్నాడు.
Bittu who single handedly cleaned the river for eight months was shocked to see it polluted again within a month by the locals. https://t.co/XdcHw2qhQ0
— 🚨Indian Gems (@IndianGems_) October 13, 2026
ఇదీ చదవండి: శివయ్యా.. ఏంటయ్యా ఈ ఘోరం!


