బైక్‌పై వెళ్తున్న టైంలో హఠాత్తుగా అతను నా కాళ్లపై చేతులు వేశాడు. వద్దని చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేశాడు. నా గుండె ఆగినంత పనైంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఫోన్‌లో రికార్డ్ చేస్తూ ఉండిపోయా. ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు ఎదురు కాకూడదని కోరుకుంటున్నా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బైక్ డ్రైవర్‌తో తనకు ఎదురైన పరిస్థితిని ఓ యువతి పంచుకోగా అది నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది.
మెట్రో నగరం బెంగళూరులో ఓ యువతితో బైక్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. బైక్‌పై వెళ్తున్న సమయంలో ఆమెను తాకుతూ ఇబ్బంది పెట్టాడు. ఈ వేధింపులను ఆ యువతి తన ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. గురువారం సాయంత్రం విల్సన్ గార్డెన్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో నేపథ్యం, బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బాధిత యువతి చర్చ్ చర్చ్ స్ట్రీట్ నుంచి తాను ఉండే హాస్టల్‌కు ర్యాపిడో ద్వారా బైక్ రైడ్‌ను బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కాసేపటికి కెప్టెన్ తన చేతులతో ఆమె తొడలను తాకడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతన్ని వారించింది. అయినా కూడా పట్టించుకోకుండా అతను అదే పని చేస్తూ ఉండిపోయాడు. దీంతో ఆమె ‘‘అన్నా.. ఏం చేస్తున్నావ్?.. వద్దన్నా..’’ అంటూ బతిమాలుకుంది. అయినా ఆ కామాంధుడు వినలేదు. ఈలోపు..
తన గమ్యస్థానం రావడంతో ఆమె దిగేసింది. ఆ సమయంలోనూ ఆమె ఇబ్బందిని గమనించిన ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశాడు. జరిగిందంతా చెప్పడంతో ఆ వ్యక్తి ఆ కెప్టెన్‌ను నిలదీశాడు. దీంతో తప్పైపోయిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. కాస్త దూరం వెళ్లాక యువతిని చూస్తూ చేతులతో అసభ్య సంజ్ఞలు చేశాడు. దీంతో ఆమె భరించలేకపోయింది. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాను సిటీకి కొత్త అని, అందుకే ఆ రైడ్‌ను మధ్యలో ఆపలేకపోయానని, ఇలాంటి ఘటనలు కొత్త కాకపోయినా తనకు ఎదురైన అనుభవం మరేయితర మహిళకు ఎదురుకాకూడదని, ఇలాంటి ప్రయాణాల్లో ఒంటరి మహిళలు భద్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓ పోస్ట్ చేసింది. నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నట్లు విల్సన్ గార్డెన్ పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ర్యాడిడో సంస్థ స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: తుపాకులు కావాలా? ల్యాప్‌ట్యాప్‌లు కావాలా?


