సీతామర్హి: ‘‘మేం ల్యాప్ టాప్స్ ఇస్తే.. వారు గన్స్ ఇస్తున్నారు.. బిహార్‌కు తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు’’ అంటూ ఆర్జేడీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిహార్‌లోని సీతామర్హిలో శనివారం.. ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ.. బీహార్‌కు స్టార్టప్‌లు అవసరం.. 'హ్యాండ్స్ అప్' గ్యాంగ్ కాదంటూ విమర్శలు గుప్పించారు.
ఆర్జేడీ, ఇతర ప్రతిపక్ష పార్టీల టార్గెట్‌గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని మోదీ.. రాష్ట్ర యువతను గూండాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్డీఏ యువతకు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి అందిస్తుండగా.. ఆర్జేడీ మాత్రం తుపాకులు ఇవ్వాలనుకుంటోందంటూ మండిపడ్డారు.
ఇవాళ్టి నాయకులు తమ పిల్లలను ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలు చేయాలనుకుంటున్నారు. కానీ మీ పిల్లలను మాత్రం గూండాలుగా తయారు చేయాలనుకుంటున్నారు. బీహార్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు. జంగిల్ రాజ్ అంటే ‘తుపాకులు, క్రూరత్వం, అవినీతి, శత్రుత్వం’గా మోదీ అభివర్ణించారు.
బిహార్‌లో నవంబర్ 11న రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ విమర్శల దాడి మరింత పెంచారు. ఆర్జేడీ ప్రచార గీతాలు, నినాదాలు వినగానే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. ఆ పార్టీ నాయకుల ప్రచారంలో బీహార్ పిల్లల కోసం వారు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్జేడీ వేదికలపై అమాయక పిల్లలను గ్యాంగ్‌స్టర్లుగా మారాలనుకుంటున్నట్లు చెప్పిస్తున్నారు’’ అంటూ మోదీ ఆరోపించారు.


