సినీ ప్రియులకు అక్టోబర్ ఫుల్ మీల్స్ పెట్టబోతోంది. ఈ నెలలో వరుసగా ఆసక్తికరమైన సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు, విభిన్న కథాంశాలతో తెరకెక్కిన మూవీస్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా దసరా పండుగను టార్గెట్ చేస్తూ పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవేంటో చూద్దాం రండి!
అక్టోబరు 2తో మొదలు..
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ : శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఫాహద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్‌దేవ్ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన ఈ సినిమాని అక్టోబరు 2న రిలీజ్ అవుతోంది.
సిగ్మా: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, ఎన్‌వీఆర్ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి.
తెల్లకాగితం: హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎమోషనల్ మూవీ ‘తెల్లకాగితం’. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఎస్‌ఐ యుగంధర్: ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఎస్‌ఐ యుగంధర్’. మేఘ లేఖ కథానాయిక. రాఘవేంద్ర కటారీ దర్శకుడు. ఈ మూవీ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదర్శ కుటుంబం: విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం..AK47’ . ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుండగా నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 9 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
కామ్రేడ్ కళ్యాణ్: జానకిరాం మారెల్ల దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. కోన ఫిల్మ్ కార్పొరేషన్, స్కంధ వాహన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అక్టోబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దసరా పోరు..
జైలర్ 2 : రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రజినీకాంత్–నెల్సన్ కాంబినేషన్‌లోనే ‘జైలర్’కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది.
రణబాలి: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది.కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గరివిడి లక్ష‍్మి : నిజజీవిత కథలు, సంఘటనలు స్ఫూర్తిగా రాబోతున్న మరో మూవీ 'గరివిడి లక్ష‍్మి'. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నల్లజీలకర్ర మొగ్గ' అని సాగే ఓ పాటని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 90ల కాలంలో దాదాపు 15 ఏళ్లలో ఏకంగా 10 వేలకు పైగా ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న గరివిడి లక్ష‍్మీ అనే ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో లక్ష‍్మీ పాత్రలో ఆనంది కనిపించనుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.

కల్ట్: నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కల్ట్’. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ కాకరాల మరో నిర్మాత. ఈ సినిమాను అక్టోబరు 30న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ నెగటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ అప్పీల్‌తో కూడిన కథ ఉన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఏమో ఏమో ఇది : శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏమో ఏమో ఇది’. అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా కనిపించనుంది.
కాగా చిత్రాలతో పాటు పలు మరికొన్ని చిన్న సినిమాలు అక్టోబర్‌లోనే రిలీజ్‌కు ముస్తాబవుతున్నాయి.


