పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో.. ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమాపైనా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అందులోనూ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’పై అయితే రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. మొన్నటివరకు ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు మాత్రం ఒకే భాగంగా పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ‘రాకా’ విషయంలో మేకర్స్ అసలు ప్లాన్ ఏంటి?
అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఈ మధ్య వరుసగా ఆసక్తికరమైన అప్‌డేట్స్ వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో, విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ నిర్ణయంపై మేకర్స్ మరోసారి ఆలోచిస్తున్నారట.
ఒకే భాగంగా సినిమా పూర్తి చేయాలని నిర్ణయిస్తే.. 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ప్లాన్‌గా తెలుస్తోంది. అదే కథ పరిధి, నిడివి దృష్ట్యా రెండు భాగాలుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని భావిస్తే.. తొలి భాగాన్ని 2027 డిసెంబరులోనే తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
(ఇదీ చదవండి: షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్.. 84 ఏళ్ల వయసులో గాయం..)
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
‘రాకా’ కథ రెండు భిన్నమైన ప్రపంచాలు, టైమ్‌లైన్స్‌లో సాగుతుందని ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. ఇందులో పౌరాణిక కాలానికి సంబంధించిన నేపథ్యంతో పాటు ఆధునిక ప్రపంచానికి సంబంధించిన కథ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో, మూడు టైమ్‌లైన్స్‌లో కనిపించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
(చదవండి: రాజమౌళికే జలాక్.. భార్య రమా రాజమౌళి వీడియో వైరల్)
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీపికా పదుకొణె తనకు సంబంధించిన తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసే దిశగా వెళ్తున్నట్లు సమాచారం. మరోవైపు రష్మిక మందన్న కూడా గ్యాప్ తర్వాత సెప్టెంబరులో మళ్లీ ‘రాకా’ సెట్స్‌లో అడుగుపెట్టారు. అల్లు అర్జున్–రష్మిక కాంబినేషన్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. మిగిలిన షూటింగ్‌తో పాటు రషెస్‌ను పరిశీలించిన తర్వాతే సినిమాను ఒకే భాగంగా ముగించాలా? లేక రెండు భాగాలుగా విభజించాలా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.
కథను ఒకే సినిమాలో సమర్థంగా చెప్పగలిగితే ‘రాకా’ను సింగిల్ పార్ట్‌గానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే కథ పరిధి, నిడివి ఎక్కువై.. మరింత విస్తృతంగా చెప్పాల్సిన అవసరం ఉందని అనిపిస్తే రెండో భాగాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. అంటే ప్రస్తుతం ‘రాకా’ పార్ట్ 2 ఉంటుందా? లేదా? అనేది పూర్తిగా కథ, రషెస్ ఆధారంగానే నిర్ణయించే అవకాశం ఉంది.


