ఆగిన యుద్ధం ఆగినట్టేనా? | Sakshi Guest Column On USA, Israel, Iran War Issue | Sakshi
Sakshi News home page

ఆగిన యుద్ధం ఆగినట్టేనా?

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

Sakshi Guest Column On USA, Israel, Iran War Issue

సందర్భం

ఎంతమాత్రం అవసరం లేని దుర్మార్గపు యుద్ధాన్ని 108 రోజులపాటు సాగించి ఇరాన్‌కే గాక ప్రపంచానికంతా తీవ్ర నష్టాలు కలిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, తానిక ఏమీ చేయలేనని గ్రహించి కావచ్చు యుద్ధ విరమణకు ‘అవగాహనా పత్రం’ ఒకటి ఇరాన్‌తో పాటు ప్రకటించారు. ఆ పత్రంపై ఈ నెల 19న జెనీవాలో జరగగలవంటున్న సంతకాలకు ట్రంప్‌ సహచర యుద్ధవీరుడు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ నుంచి కొత్త విఘాతాలు ఏర్పడని పక్షంలో, మరొక రెండు మాసాలకు మలివిడత చర్చలు జరుగుతాయి. అంతవరకు అందరం మధ్యంతర ఊపిరి పీల్చుకున్నా, తదనంతర పరిస్థితిపై ఇంకా ఊపిరి బిగబట్టవలసిందే.

కుదిరినట్టేనా ‘అవగాహన’?
ఆ ‘పత్రం’లో ఏమున్నదనే వివరాలు జెనీవాలో సంతకాల తర్వాతే ప్రకటిస్తామని అంటున్నారు. ఇంతవరకు ట్రంప్‌ చెప్పిన దానినిబట్టి, అన్ని క్షేత్రాలలో కాల్పులు వెంటనే ఆగిపోతాయి. ఇరాన్‌ రేవులపై దిగ్బంధాన్ని అమెరికా, హార్మూజ్‌పై దిగ్బంధాన్ని ఇరాన్‌ ఎత్తివేస్తాయి. ఓడలపై ఇరాన్‌ సుంకాలు విధించదు. చమురు రవాణా మునుపటి వలె స్వేచ్ఛగా సాగవచ్చు. ట్రంప్‌ చేసిన ప్రకట నను ఇరాన్‌ ఖండించలేదు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పిన దాని ప్రకారం, యుద్ధం అన్ని క్షేత్రాలలో వెంటనేగాక శాశ్వతంగా కూడా నిలిచిపోతుంది. 

ఇంకా ఇతరత్రా వెల్లడవుతున్న వివరాల ప్రకారం, అమెరికా స్తంభింపజేసిన 24 బిలియన్‌ డాలర్ల నిధులలో మొదట సగం మేర విడుదల చేస్తారు. ఇరాన్‌ పునర్‌ నిర్మాణానికి అమెరికా మిత్ర దేశాలతో కలిసి 300 బిలియన్లు సమకూర్చుతారు. అవగాహనా పత్రంలో ఇరాన్‌ యురేనియం నిల్వలు, క్షిపణులు, హమాస్, హెజ్బొల్లా, హౌతీల వంటి మిలిటెంట్‌ సంస్థల ప్రస్తావనలు లేవు. ఈ చర్చలు మలిదశలో ఉండగలవన్నది సూచన.

ఇరాన్‌ రేవుల దిగ్బంధాల ఎత్తివేత 19 లోగా పూర్తిగా జరిగితేనే తాము అవగాహనా పత్రంపై సంతకాలు చేయగలమని ఇరాన్‌ వెంటనే స్పష్టం చేసింది. ఇందులోని మెలిక ఏమంటే, అమెరికా తాను చేయగలిగింది తాను చేయవచ్చుగాక. కానీ, లెబనాన్‌పై, అక్కడి హెజ్బొల్లాపై దాడులను  కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, ఇపుడు ఆపుతుందా అన్నది పెద్ద ప్రశ్న. చివరకు ఆదివారం రాత్రి తన ప్రక టనకు కొద్ది గంటల ముందు కూడా నెతన్యాహూను ట్రంప్‌ పరుషమైన భాషలో హెచ్చరించవలసి వచ్చింది. ఆ మీదట నెతన్యాహూతో పాటు ఆయన రక్షణ మంత్రి కట్జ్‌ అసాధారణమైన రీతిలో సంయుక్త ప్రకటన చేస్తూ, తాము దాడులు చేస్తున్నది హెజ్బొల్లాపై తప్ప లెబనాన్‌పై కాదని వివరించబూనారు. 

అది నిజం కాదని అందరికీ తెలుసు. గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ సృష్టి దీర్ఘకాలిక లక్ష్యంగా గల ఇజ్రాయెల్, అందుకోసం పాలస్తీనా, జోర్డాన్‌లతో పాటు లెబనాన్‌ తదితర అరబ్‌ దేశాల భూభాగాలను ఆక్రమించటం ఒక కార్యక్రమంగా నేటికీ కొనసాగిస్తున్నది. ఆ మేరకు జియోనిస్టు సిద్ధాంత కర్తలు ప్రతిపాదించిన ఒక మ్యూపును నెతన్యాహూ నిరుడు విడుదల చేస్తూ, తానందుకు కట్టుబడి ఉన్నాన న్నారు. పాలస్తీనాను మొత్తంగా ఇజ్రాయెల్‌లో భాగంగా చూపే మ్యాపును ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలోనే ప్రదర్శించారు.

‘గ్రేటర్‌ ఇజ్రాయెల్‌’ ఆగుతుందా?
నిజానికి ప్రస్తుత యుద్ధాన్ని అణ్వాయుధాల సాకుతో అమె రికాతో కలిసి మొదలుపెట్టడంలోని రహస్యోద్దేశం కూడా పాలస్తీనా ఆక్రమణకు, పశ్చిమాసియాలో ఆధిపత్యానికి అడ్డంకిగా గల ఇరాన్‌ను విచ్ఛిన్నం చేయటమేనన్నది రహస్యం కాదు. అందుకే, ప్రస్తుత యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు ప్రతిసారి విఘాతం కలి గిస్తూ వస్తున్న ఇజ్రాయెల్, అవగాహనా పత్రం అమలును మరొక మారు భంగపరచబోదన్న హామీ లేదు. అందుకే కావచ్చు ఇరాన్‌ నాయకత్వం, అవగాహన అంటూ కుదిరినా తమ వేళ్లు ఎల్లప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయని ఆ వెంటనే ప్రకటించింది.

సమస్యలలో సులభమైన వాటిపై ప్రస్తుతానికి రాజీ కుదురు తున్నది. జరుగుతున్న దాడుల నిలిపివేత, నౌకా దిగ్బంధాల ఎత్తివేత వంటివి తేలికైన విషయాలు. అందువల్ల చమురు, సరకుల రవాణాలు సాఫీగా జరిగి ఇరాన్, గల్ఫ్‌ దేశాలతో పాటు ప్రపంచాని కంతా ఉపయోగకరమవుతుంది. తమకిచ్చిన హామీలు జెనీవా సంతకాల తర్వాత 60 రోజులపాటు సక్రమంగా అమలైతేనే మలి విడత చర్చలు జరప గలమని ఇరాన్‌ స్పష్టం చేసింది. అంతా అదే ప్రకారం జరుగుతుందనీ, మొదట ఈ నెల 19 వరకూ, తర్వాత 60 రోజుల వరకూ ఇజ్రాయెల్‌ను ట్రంప్‌ పూర్తి నియంత్రణలో ఉంచ గలరనీ, మరొకవైపు హెజ్బొల్లాను ఇరాన్‌ నియంత్రించగలదనీ భావించినా, ఆ మలి విడత చర్చలు ఎంత మాత్రం తేలిక కాబోవు. అప్పటి అజెండా క్లిష్టమైనది కాగలదు.

వాటిలో అన్నింటికన్న ప్రధానమైనది ఇరాన్‌ అణుశక్తి కార్య క్రమం. ఆదివారం రాత్రి ట్రంప్‌ తమ ఒప్పందాన్ని ప్రకటిస్తూ,అంతా సాధారణ పరిస్థితికి చేరినాక తాము ఇరాన్‌లో ప్రవేశించి యురేనియంను స్వాధీనపరచుకుని, అమెరికాకు తెచ్చి నిరుపయో గంగా మార్చగలమన్నారు.ఆ పని చేయటంవల్ల ఇజ్రాయెల్‌కు అణుముప్పు తొలగిపోతుందని, కనుక ప్రస్తుతానికి మౌనంగా ఉండాలంటూ నెతన్యాహూను ఒప్పించినట్లు వార్తలు చెప్తున్నాయి. కానీ, ఇరాన్‌ వార్తలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. శాంతియుత ఉప యోగం తమ అంతర్జాతీయ హక్కు అని మొదటినుంచి ప్రకటిస్తున్న ఇరాన్, అది ఎప్పటికీ వదలుకోబోమనీ, యురేనియం శుద్ధి శాతాన్ని ప్రస్తుత 60 శాతం నుంచి గణనీయంగా తగ్గించి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీలు మరింత పెరిగేందుకు అనుమతించగల మనీ చెప్తున్నది. తమ క్షిపణులు ఆత్మరక్షణకు తప్పనిసరి గనుక వాటి పరిధి తగ్గింపు ఆమోదయోగ్యం కాదనీ, మిలిటెంట్‌ సంస్థలు ప్రధా నంగా ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి స్వతంత్రంగా పని చేస్తాయి గనుక, వాటిని నిరోధించే శక్తి తమకు లేదనీ అంటున్నది. 

ఏం సాధించినట్టు?
ఇంతకూ, ఫిబ్రవరి 28న ఆరంభించిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’లో అమెరికా, ఇజ్రాయెల్‌ సాధించిందేమిటి? ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగా దాడులకు పాల్పడ్డ అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవటం మొదటి ఘనత. ఇస్లామిక్‌ వ్యవస్థ మార్పు (రెజీమ్‌ ఛేంజ్‌), అణుశక్తి సామర్థ్య నిర్మూలన, బాలిస్టిక్‌ క్షిపణుల ధ్వంసం, మిలిటెంట్‌ మిత్రుల అంతం అనే లక్ష్యాలలో ఏ ఒక్కటీ నెరవేరక పోవటం రెండవ ఘనత. అగ్రనేత ఖొమెనేయ్‌ని కుటుంబంతో సహా మొదటి రోజునే ప్రాణాలు తీసినా ఇరానీ నాయ కత్వం, జాతి మొత్తం ఏకమై నిలిచి నెలల తరబడి ప్రతిఘటించేట్లు చేయటం మూడవ ఘనత. ఇరాన్‌ ప్రతిఘటనతో స్వయంగా తమ స్థావరాలతో పాటు ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు తీవ్ర నష్టాలకు గురి కావటం నాల్గవ ఘనత. చమురు, గ్యాస్‌ సమస్యలతో ప్రపంచం అతలాకుతలం కావటం అయిదో ఘనత. ఇరాన్‌ ‘బేషరతుగా లొంగిపోవాలన్న డిమాండ్‌ ఏమైందో అమెరికా అధ్యక్షుడే చెప్పాలి.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement