విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చేవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు. మొదట అదృశ్యం కేసుగా నమోదైంది ఈ వ్యవహారం. ఆ తర్వాత కస్టడీలో మృతి చెందాడన్న ఆరోపణలు వచ్చాయి.
సాయికృష్ణను 2026 మే నెలలో ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు నాన్-బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అదుపులోకి తీసుకువచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకపోవడంతో పాటు ఇంటికి కూడా రాకపోవడంతో, అతని తల్లి విజయలక్ష్మి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కస్టడీలోనే తన కుమారుడిని హింసించి చంపేశారని, ఆ తర్వాత ఆధారాలు మాయం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు.


