‘డిజిటల్‌’ సందేహాలు! | - | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’ సందేహాలు!

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

● విద్యుత్‌ బిల్లు కలెక్షన్‌ కేంద్రాల మూసివేతకు ఎస్పీడీసీఎల్‌ కసరత్తు ● యూపీఐ చెల్లింపులే చేయాలని సూచన ● స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే అవస్థలే..!

తిరుపతి రూరల్‌ : డిజిటల్‌ ఇండియా పేరుతో సామాన్యుడి విద్యుత్‌ బిల్లుపై మరో భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా ? స్మార్ట్‌ఫోన్‌ లేని వారు.. యూపీఐ వినియోగం తెలియని వారు.. ఆన్‌లైన్‌ చెల్లింపులపై అవగాహన లేని నిరక్షరాస్యులు ఇక కరెంట్‌ బిల్లు ఎలా కట్టాలి అనే ప్రశ్నలు పలువురిని వేధిస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు చూపకుండా ‘డిజిటల్‌’ పేమెంట్‌ మాత్రమే చేయాలనడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డిజిటల్‌ గురించి తెలియని వినియోగదారుల పరిస్థితిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆన్‌లైన్‌ డిజిటల్‌ పేమెంట్‌ మాత్రమే చేయాలని వినియోగ దారులపై ఒత్తిడి తీసుకురావడంలో ఆంతర్యమేమిటి..? ఇందులో ప్రభుత్వ పెద్దలకు, డిస్కం అధికారులకు ఏదైనా వాటాలు వున్నాయా..? అందుకే ఇంతలా ఒత్తిడి తెస్తున్నారా..? అనే అనుమానాలు వినియోగదారులు నుంచి వ్యక్తమవుతున్నాయి. డిజిటల్‌ పేమెంట్‌కు పల్లెల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా బిల్లు చెల్లింపులు మాత్రం నగదు రూపంలో చేసుకునేది లేదని కలెక్షన్‌ సిబ్బంది చెబుతుండటం గమనార్హం. అందులో భాగంగానే ఆదివారం చంద్రగిరి మండలం శానంబట్ల పంచాయతీలో రం విద్యుత్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని సిబ్బంది స్పష్టం చేయడంతో గ్రామస్తులు మండిపడ్డారు.

కేంద్రాల మూసివేత!

ఒకవైపు 49.5 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తున్నారు. మరోవైపు భౌతికంగా బిల్లులు చెల్లించే పల్లె వాసులకు కష్టాలు తప్పడం లేదు. స్మార్ట్‌ ఫోన్లు, డిజిటల్‌ వ్యవస్థ అందరికీ అందుబాటులోకి రాకముందే బిల్లు చెల్లింపు మార్గాలను మూసివేయడం ఎంతవరకు సమంజసమని పల్లె వాసులు ప్రశ్నిస్తున్నారు. ఒక నెలకు రూ.520 కోట్ల బిల్లింగ్‌లో సుమారు రూ.257.4 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నారు. మిగిలిన సుమారు రూ.262.6 కోట్ల చెల్లింపులు ఆఫ్‌లైన్‌ మార్గాల్లో బిల్లు కలెక్షన్‌ సిబ్బంది ద్వారా జరుగుతున్నాయి. ఆ లెక్కన డిజిటల్‌ వ్యవస్థకు ఇంకా భారీ సంఖ్యలో విద్యుత్‌ వినియోగదారులు దూరంగానే ఉన్నారన్నది మాత్రం నిజమని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement