● ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకం ● వందలాది ట్రాక్టర్లతో తరలించి విక్రయం ● ప్రకృతి సంపద.. టీడీపీ నేతల పరం
తొట్టంబేడు (శ్రీకాళహస్తిరూరల్): శ్రీకాళహస్తి పట్టణ పరిసరాల్లోని చెరువులపై మట్టి మాఫియా కన్ను పడింది. టీడీపీ నేతల కన్నుసన్నల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో మట్టిని తవ్వుతూ ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణానికి కూతవేటు దూరంలోని కమ్మకొత్తూరు చెరువు, ఉరుందూరు చెరువు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు జేసీబీలు.. భారీ సంఖ్యలో ట్రాక్టర్లు?
కమ్మకొత్తూరు చెరువులో రెండు జేసీబీలతో మట్టిని తవ్వి, పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి తరలింపు సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలతో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడంతో చెరువు స్వరూపమే మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ అవసరాల పేరిట..
చెరువుల్లోని మట్టిని వ్యవసాయ భూముల చదును కోసం వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను అడ్డుపెట్టుకుని మట్టిని ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాళహస్తి సమీపంలోని ఆరులేన్ల జాతీయ రహదారి పరిసరాల్లో భూములకు భారీగా డిమాండ్ పెరగడంతో వెంచర్ల కోసం మట్టి అవసరం ఏర్పడింది. ఇదే అదునుగా అక్రమ మట్టి తరలింపు సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రాణాలకే ప్రమాదం
చెరువుల్లో ఏర్పడిన లోతైన గోతులు ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. చేపల వేటకు వెళ్లే వారు, చెరువు పరిసరాల్లో సంచరించే చిన్నారులు, పశువులు గోతుల్లో పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసి గోతులు నీటితో నిండితే వాటి లోతు తెలియక పలువురు ప్రాణాలు పోగొట్టుకునే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
రహదారులకు ముప్పు
భారీ సంఖ్యలో ట్రాక్టర్లు తిరగడంతో రహదారులకు ముప్పు వాటిల్లుతోంది. మట్టి రవాణా చేసే వాహనాల కారణంగా దుమ్ము, రోడ్లపై మట్టి పేరుకుపోవడంతో రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. దీనిపై స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
వివరాలు వెల్లడించాలి
చెరువుల నుంచి అక్రమంగా మట్టి తరలిస్తే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయా? అనుమతులుంటే వాటి పరిమితి ఎంత? ఎంత మట్టి తరలించారు? ఎక్కడికి తరలించారు? ప్రభుత్వానికి ఎంత రుసుము చెల్లించారు? అన్న అంశాలపై అధికారులు బహిరంగంగా వివరాలు వెల్లడించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల అలసత్వంతోనే..
చెరువులు ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండగా, భూములు– అనుమతుల వ్యవహారాలను రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. అక్రమ రవాణా, రహదారి భద్రత అంశాల్లో పోలీసు శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయినప్పటికీ మూడు శాఖల సమన్వయ లోపంతో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులను కాపాడాల్సిన అధికారులే అక్రమ తవ్వకాలను అడ్డుకోకపోతే భవిష్యత్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి
కమ్మకొత్తూరు, ఉరుందూరు చెరువులతోపాటు శ్రీకాళహస్తి పరిసరాల్లోని అన్ని చెరువుల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిగితే జేసీబీలు, ట్రాక్టర్లను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికై నా మేల్కొని మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపకపోతే చెరువుల స్థితిగతులే మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


