భూ మాయగాళ్లు! | - | Sakshi
Sakshi News home page

భూ మాయగాళ్లు!

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

తిరుపతికి చెందిన అరుణమ్మ కుమారుడు ప్రవీణ్‌రెడ్డి పదేళ్ల క్రితం చెన్నాయిగుంట పరిధిలోని శేషాచలం హిల్‌ వ్యూ లేఅవుట్‌ హెచ్‌ఐజీ ఫేజ్‌ 1, ప్లాట్‌ నంబర్‌ 18లోని 563.8 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. తర్వాత దాన సెటల్‌మెంట్‌ కింద తన తల్లి అరుణమ్మ పేరిట బదలాయించారు. కొద్ది రోజుల క్రితం కొందరు ఆ స్థలం గురించి విచారించారు. విషయం తెలుసుకున్న అరుణమ్మ ఈసీ తీయగా.. ఆ స్థలం జై భరత్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ అయినట్లు తెలుసుకున్నారు. ఆ వెంటనే రేణిగుంట సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం నుంచి పత్రాలు తెప్పించి పరిశీలించగా.. ఆధార్‌, పాన్‌, ఫొటో, సంతకాలు, వయసు, ఇతర గుర్తింపు వివరాలన్నీ మార్చేసినట్లు గుర్తించారు. తన ప్రవేమయం లేకుండానే ఆధార్‌, పాన్‌, ఫొటోలు మార్చేసి.. సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు జై భరత్‌రెడ్డి, సాయిరామ్‌ అలియాస్‌ సంతోష్‌, చైతన్య కుమార్‌, బాబు, అబ్దుల్‌ రెహమాన్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. న్యాయస్థానం ఈ మేరకు నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

తిరుపతి మంగళం వద్ద తుడా క్వార్టర్స్‌లో విలువైన ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయంటూ ఆకాష్‌ అలియాస్‌ బాబ్జీ అనే వ్యక్తి పలువురికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకుని ఏర్పేడు మండలానికి చెందిన నాయుడు అనే వ్యక్తి కొనుగోలు చేసేందుకు బేరం కుదుర్చుకుని కొంత మొత్తం అడ్వాన్స్‌ కూడా ఇచ్చాడు. ఆకాష్‌ ఇచ్చిన పత్రాలు తేడాగా ఉండడంతో అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. కొంత సమయం కావాలని ఆకాష్‌ కోరుతూ.. తనకు మరో రూ.30 లక్షలు అవసరమని అందుకు అవసరమైన పత్రాలు ఇస్తానని నమ్మించాడు. ఆ పత్రాలను నమ్మి మళ్లీ రూ.30 లక్షలు, మరో సారి రూ.6లక్షలను ఆకాష్‌కి ఇచ్చారు. ఆ భూమి, ప్లాట్‌ పత్రాలను పరిశీలించాక అవి కూడా నకిలీ అని నాయుడు తెలుసుకుని ఆకాష్‌ని గట్టిగా నిలదీశాడు. దీంతో మరో ప్లాట్‌ ఉందని నాయుడుని నమ్మించాడు. ఆ ప్లాట్‌ విక్రయిస్తే.. మొత్తం తిరిగి ఇచ్చేస్తానని, పార్టీని తీసుకురమ్మని చెప్పాడు. చేసేది లేక నాయుడు తిరుచానూరుకు చెందిన ఓ వ్యక్తి, తిరుపతికి చెందిన మరో ఇద్దరికి ప్లాట్లను చూపించారు. రూ.కోటికి పైనే బేరం కుదుర్చుకున్నారు. మొత్తం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించమని నాయుడు కొనుగోలు దారులకు జాగ్రత్తలు చెప్పారు. అదే విధంగా కొనుగోలు దారులు ఆన్‌లైన్‌ ద్వారా నగదును చెల్లించేశారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన ప్లాటు పత్రాలను పరిశీలించగా.. ఆధార్‌తో పాటు.. డాక్యుమెంట్లు నకిలీవని తెలుసుకుని డబ్బులు ఇవ్వమని ఒత్తిడి చేశారు. ఆకాష్‌ స్పందించకపోవడంతో బాధితులు తిరుచానూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించి 10 మందిపై కేసునమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసి న్యాయస్థానానికి అప్పజెప్పారు.

నకిలీ యజమానులను సృష్టించి విక్రయాలు ఆధారాలు మార్పించి.. రూ.కోట్లు కొట్టేస్తున్న కేటుగాళ్లు ఇటీవలే తిరుచానూరు పోలీసులకు పట్టుబడిన కొందరు అక్రమార్కులు

సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి.. చిత్తూరు జిల్లాల్లో నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. నకిలీ పత్రాలతో కొత్త గుర్తింపును సృష్టించడం ద్వారా రిజిస్ట్రేషన్‌్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఆధార్‌లో పేరు, చిరునామా, ఫొన్‌ నంబర్‌ వంటి వివరాల్లో మార్పులు చేసి.. అసలు యజమానులను పక్కనపెట్టి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేయించిన ఘటనలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గుర్తింపు ధ్రువీకరణకు ఉపయోగించాల్సిన ఆధార్‌ కార్డే.. భూ మోసగాళ్ల చేతిలో అక్రమ లావాదేవీలకు ఆయుధంగా మారిపోతోది. తిరుచానూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కేటుగాళ్ల ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఆధార్‌ కార్డులో చిన్న మార్పు.. ఆస్తి రిజిస్ట్రేషన్‌లో పెద్ద మోసం. పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలను మార్చి అసలు యజమానులకు తెలియకుండానే భూములు, ఇళ్లు బదలాయించేస్తున్నారు. ఆధార్‌ ఆధారంగా వ్యక్తి గుర్తింపును నిర్ధారించాల్సిన వ్యవస్థలోని లోపాలను కొందరు దళారులు, మధ్యవర్తులు, అక్రమ రిజిస్ట్రేషన్‌ ముఠాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనేందుకు పై రెండు ఘటనలే సాక్ష్యం. కొందరు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారుల సహకారంతో భూ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు.

దందా జరుగుతోంది ఇలా..

భూ యజమానుల ఆధార్‌, పాన్‌న్‌, మొబైల్‌ వివరాలను సేకరిస్తారు. ఆధార్‌లో చిరునామా లేదా మొబైల్‌ నంబర్‌ మార్పు చేస్తారు. నకిలీ వారసత్వ, కుటుంబ, చిరునామా పత్రాలను సిద్ధం చేస్తారు. యజమాని తరఫున మాట్లాడే వ్యక్తిని ఏర్పాటు చేస్తారు. బయోమెట్రిక్‌, ఓటీపీ లేదా గుర్తింపు ధ్రువీకరణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌న్‌ పూర్తిచేసి ఆస్తిని మరొకరి పేరుకు బదలాయిస్తారు. ఈ ప్రక్రియలో పలు దశల్లో జరిగే ధ్రువీకరణను సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించకపోవడమే మోసగాళ్లకు అవకాశంగా మారుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బాధితులకు తెలియకుండానే..

విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న భూ యజమానులు, వృద్ధులు, ఒంటరిగా ఉండే మహిళలు, కుటుంబ వివాదాల్లో ఉన్న ఆస్తి యజమానులు ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నారని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌న్‌ పూర్తయిన తర్వాతే తమ ఆస్తి మరొకరి పేరు పైకి వెళ్లిందని బాధితులు గుర్తిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో పాత మొబైల్‌ నంబర్‌ పనిచేయకపోవడం, చిరునామా మార్పు, కుటుంబ సభ్యులపై నమ్మకం వంటి అంశాలను ఉపయోగించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు, అడంగల్‌ సర్టిఫికెట్‌ వంటి రికార్డులను సమయానుకూలంగా పరిశీలించకపోవడంతో మోసం ఆలస్యంగా బయటపడుతోంది.

పత్రాలు మార్చి.. రిజిస్ట్రేషన్లు

జాగ్రత్తలు ఇలా..

మీ ఆధార్‌లో నమోదైన మొబైల్‌ నంబర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఆధార్‌ బయోమెట్రిక్‌ను అవసరం లేనప్పుడు లాక్‌ చేసి ఉంచాలి. పోర్టల్‌లో ఆధార్‌ వినియోగ చరిత్రను పరిశీలించాలి. ఆస్తులకు సంబంధించిన సర్టిఫికెట్‌ను తరచూ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్‌న్‌ పత్రాలు, అడంగల్‌, పన్ను రికార్డులను సరిపోల్చాలి. అనుమానం ఉంటే వెంటనే పోలీసులు, సబ్‌ రిజిస్ట్రార్‌, జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారికి ఫిర్యాదు చేయాలి.

అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం

ఆధార్‌ సమాచారం మార్పులు, ఆస్తి రిజిస్ట్రేషన్లు రెండు వేర్వేరు ప్రక్రియలైనా.. రెండింటిలోనూ వ్యక్తి గుర్తింపు కీలకంగా ఉంటుంది. కాబట్టి అనుమానాస్పద మార్పులు, తరచూ జరిగే చిరునామా మార్పులు, కొత్త మొబైల్‌ నంబర్ల జోడింపు, వెంటనే జరిగే ఆస్తి బదలాయింపులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. రిజిస్ట్రేషన్‌న్‌ సమయంలో పత్రాల పరిశీలనతోపాటు యజమాని ప్రత్యక్ష హాజరు, వీడియో రికార్డింగ్‌, బయోమెట్రిక్‌ ధ్రువీకరణ, నోటీసు వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆధార్‌ వివరాల్లో అనధికార మార్పులు, ఆస్తి రిజిస్ట్రేషనన్‌్‌ అక్రమాలపై పోలీసులకు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement