మెగా డీఎస్సీ అవినీతి, అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ
అన్ని నియోజకవర్గాల్లో దగా డీఎస్సీపై భారీ ర్యాలీలు
తిరుపతి సిటీ: మెగా డీఎస్సీ పేరుతో బాబు సర్కార్ చేసిన అవినీతి అక్రమాలపై తిరుపతి జిల్లాలో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. మూడు రోజు పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో జరిగిన జెన్‌జెడ్ వార్ రిలే దీక్షలు సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో సోమవారం జరిగిన జెన్‌జెడ్ వార్ ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొన్నారు. దగా డీఎస్సీపై కదం తొక్కారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీకి తండోపతండాలుగా తరలివచ్చారు. సీఎం సొంత మండలం, చంద్రగిరిలో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొన్న జనసందోహాన్ని చూసి కూటమి నేతల్లో గుబులు పట్టుకుంది.
తిరుపతిలో కదంతొక్కిన వేలాది మంది
వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో కొర్లగుంట సర్కిల్ నుంచి అక్కారం పల్లి రోడ్డు వరకు దగా డీఎస్సీపై నల్ల దుస్తులు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, మాజీ కార్పొరేటర్లు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.
నినదించిన శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జన్‌జెడ్ వార్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ర్యాలీతో శ్రీకాళహస్తి దద్దరిల్లింది. పార్టీ జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, గ్రామ స్థాయి నేతలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
దగాపై ధ్వజమెత్తిన వెంకటగిరి
వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కలువాయి మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబూని యువత నినదించారు. సుమారు రెండు గంటల పాటు ర్యాలీ సాగింది. పార్టీ నేతలు , పలు మండలాల కన్వీనర్లు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
కదం తొక్కిన రైల్వేకోడూరు
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుంచి కోడూరు పట్టణం వరకు దగా డీఎస్సీపై భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ఆ పార్టీ కన్వీనర్లు, నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జనసంద్రమైన సూళ్లూరుపేట
సూళ్లూరుపేట జనసంద్రమైంది. నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్య నగర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత కదం తొక్కారు. ర్యాలీతో ప్రధాన రోడ్లు జనసంద్రాన్ని తలపించాయి. ఆరు మండలాలకు చెందిన ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కలువాయిలో హోరెత్తిన ర్యాలీలో సమన్వయకర్త రామ్‌కుమార్‌రెడ్డి
డీఎస్సీ అక్రమాలపై కూటమి నిర్లక్ష్య వైఖరి
తిరుపతి మంగళం : మెగా డీఎస్సీ నియామకాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో సోమవారం డీఎస్సీ అక్రమాలపై తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతం జయచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీ, పార్టీ నగర అధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డితో పాటు వేలాదిమంది యువత, పార్టీ శ్రేణులతో కలిసి నల్ల దుస్తులు ధరించి, ప్లకార్డులు చేతబట్టుకుని భూమన భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలు, రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా డీఎస్సీ నియామకాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడడం సిగ్గుగా లేదా? చంద్రబాబు అని ప్రశ్నించారు. 2025 మెగా డీఎస్సీలో అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా భయటపెట్టినా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తన తన యుడు లోకేష్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. నీట్ లీకేజీతో ఢిల్లీలో యువత ఉద్యమించిన పరిస్థితి మన రాష్ట్రంలో కూడా వస్తుందని హెచ్చరించారు. లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సత్యవేడులో భారీ ర్యాలీ
సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో దగా డీఎస్సీపై కేవీబీపురం మండల కేంద్రంలో సాయిబాబా ఆలయం నుంచి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా స్థాయి నాయకులు, ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.


