సూళ్లూరుపేట: దారి దోపిడీలతో సంబంధాలున్న ముగ్గురు నిందితులను సూళ్లూరుపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 అంగుళాల పొడవు కలిగిన పెద్ద కత్తి, వీవో ఆండ్రాయిడ్ సెల్‌పోన్, రూ.200 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ ఎం మురళీకృష్ణ తెలిపారు. చెంగాళమ్మ పరమేశ్వరి ఆమ్మవారి దక్షిణం వైపు ఆర్చి వద్ద జాతీయ రహదారిపై ఎస్‌ఐ అజయ్‌కుమార్ తనిఖీలు నిర్వహిస్తుండగా సదరు ముగ్గురు ముద్దాయిలు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయడంతో వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారు మండలంలోని కోటపోలూరుకు చెందిన కిలివేటి జగదీష్, వట్రపాళెంకు చెందిన ముటుకు దీలీప్, కొల్ల చెరువు లోకేష్ అని తేలింది. ఈ ముగ్గురు నిందితులకు గంజాయి, మద్యం సేవించే అలవాటు ఉందని, కూలి పపనులు చేసుకుని సంపాదించే డబ్బు సరిపోక సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈనెల 7వ తేదీ రాత్రి వట్రపాళెంలోని మొదటి వీధిలో నడిచి వెళుతున్న ఓ వ్యక్తిని ఈ ముగ్గురితో పాటు పరారీలో ఉన్న అఫ్రిద్ కలిసి కత్తితో బెదిరించి వెయ్యి రూపాయలు నగదు దోచుకున్నారని తెలిపారు. ఆ డబ్బుతో మద్యం తాగి మిగిలిన 200 నగదును లోకేష్ వద్ద, సెల్‌ఫోన్‌ను దిలీప్ వద్ద దాచారన్నారు. సోమవారం ఉదయం కూడా మరో నేరానికి పాల్పడేందుకు ఆర్చి వద్దకు రాగా దొరికిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి కోర్డులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారని తెలిపారు.


