తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి 9 జిల్లాల నుంచి 58 వినతులు అందినట్లు సంస్థ సంస్థ డైరెక్టర్ పి.అయూబ్‌ఖాన్ తెలిపారు. విద్యుత్ వ్యవసాయ సర్వీసుల మంజూరు, విద్యుత్ స్తంభాల మార్పు, వోల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలను వినియోగదారులు తమ దృష్టికి తెచ్చారన్నారు. వీటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వినియోగదారుల విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, 1912, 1800 425 155333 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయవచ్చని, 91333 31912 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు తెలియజేయ వచ్చని సూచించారు. డైరెక్టర్లు కె.గురవయ్య, కె.రామమోహన్‌రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సీహెచ్.రామచంద్రరావు, కె.సంపత్‌కుమార్, ఎస్.రమణ పాల్గొన్నారు.


