శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం ఆడికృత్తికను పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కావళ్లు ధరించి విజ్ఞానగిరికి చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట జరగకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు విజ్ఞానగిరిలోని క్యూల వద్ద భక్తులకు సేవలందించారు. ఈ క్రమంలోనే శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారు ఇంద్ర విమానంపై విహరించారు. పెద్దసంఖ్యలో భక్తులు కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఉచితంగా ప్రసాదాల పంపిణీ
ఆడికృత్తిక ఉత్సవాలను సందర్భంగా కార్తికేయ మిత్రబృందం ఉచితంగా ప్రసాదాలు పంపిణీ చేసింది. ముక్కంటి ఆలయ కమిటీ చైర్మన్ సాయిప్రసాద్, ఈఓ వెంకటేశులు ప్రారంభించారు.


