తిరుపతి అర్బన్: క్రాఫ్ విలేజ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన బుధవారం అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం, డీఆర్‌డీఏ సమన్వయంతో మూడు ఎంపోరియం బ్లాక్‌లు, మూడు వర్క్‌షెడ్లతోపాటు మరుగుదొడ్డి సౌకర్యంతో కూడిన ఒక శిక్షణా తరగతి గది నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందన్నారు. మూడు ఎంపోరియం బ్లాక్‌లు, శిక్షణ తరగతి గదిని పూర్తి చేశారని పేర్కొన్నారు. ఒక వర్క్‌షెడ్ పూర్తయిందని, మిగిలిన రెండింటినీ త్వరలో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, శ్రీదేవి, ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారి రాజానాయక్, హ్యాండి క్రాఫ్ట్ ఏడీ సత్యమూర్తి పాల్గొన్నారు.
చెట్టు కొమ్మ తగిలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని గాజులపెళ్లూరు గ్రామంలో బుధవారం మామిడి తోటలో ట్రాక్టర్‌తో దున్నుతుండగా చెట్టు కొమ్మ తగడంతో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. కాంపాళ్లెం ఎస్టీ కాలనీకి చెందిన తుపాకుల సుబ్రమణ్యం (41) ట్రాక్టర్‌కు రోజువారి కూలీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం సుబ్రమణ్యం గాజులపెళ్లూరు గ్రామంలోని మామిడి తోటలో దున్నడానికి వెళ్లాడు. పొలంలో దున్నుతుండగా మామిడి చెట్టు కొమ్మ స్టీరింగ్‌కు తగిలింది. దీంతో సుబ్రమణ్యం స్టీరింగ్, డ్రైవింగ్ సీటు మధ్యలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుబ్రమణ్యం మృతితో వారు అనాథలయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.


