గార: వినాశకరమైన కలుపు మొక్క వయ్యారిభామ అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు భయపడుతున్నారు. రోడ్లు పక్కన, కాలువ గట్లు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో పెరిగే ఈ కలుపు మొక్క పొలాల్లో పంటను మించి పెరిగిపోతుంది. ఈ కలుపు మొక్క పొలాల్లో త్వరితగతిన వ్యాపిస్తూ పంటల దిగుబడిని తగ్గిస్తుంది. అంతేకాక జంతువులతో పాటు మానవులకు హాని చేస్తుంది. నిలువెల్లా విషం కలిగిన వయ్యారిభామ శాసీ్త్రయ నామం పార్ధినీయం హిస్టోరోఫోరెస్. ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే రోగాలు వెంటే ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దిగుబడిని తగ్గిస్తుంది
వయ్యారిభామ అనే కలుపు మొక్క పంట మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చివేస్తుంది. పూత, పిందె దశలో ప్రతాపం చూపి దిగుబడి తగ్గిస్తుంది. మొక్కలను తొలిదశలోనే నియంత్రించాలి. మొక్కజొన్న, పూల తోటలు, కూరగాయల పొలాలు, కొబ్బరి, మామిడి తోటల్లో ఈ కలుపు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
మనుషులకూ ప్రమాదమే
మొక్క పుప్పోడిని పీలిస్తే జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాపు వస్తాయి. వయ్యారిభామతో డర్కాటైటిస్, ఎగ్జిమా హైఫీవర్, ఉబ్బసం, బ్రాంకై టీస్ వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పువ్వుల నుంచి రేణువులు గాలిలో కలిసిపోవడంతో ఆ గాలి పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు పాడవుతాయి. జంతువులకు వెంట్రుకలు ఊడిపోవడం, హైపర్ టెన్షన్ పెరగడం జరుగుతుంది. సాధారణంగా పశువులు ఈ మొక్కను తినవు. పొరపాటున గడ్డితో పాటు వయ్యారిభామను తిన్న పశువులు జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, శ్వాసక్రియలు దెబ్బతింటాయి. చివరకు మరణించే అవకాశాలున్నాయి.
నివారణ చర్యలు
గ్రామాల్లోనూ, పొలాల్లోనూ ఉన్న వయ్యారిభామను పూతదశ రాకముందే వేర్లతో సహా తొలగించాలి. పూతదశకు రాకముందే 10 లీటర్లు నీటిలో 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయడం వలన మొక్కలు మొలవవు.
వయ్యారిభామ కలుపు మొక్కలు ఇటీవల కాలంలో పొలాల్లోనూ, రోడ్లు వెంబడి ఏపుగా పెరుగుతున్నాయి. వీటివలన పంటలతో పాటు మనుషులు, జంతువులకు ప్రమాదమే. దిగుబడి తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటికి తొలి దశలోనే నివారణ చర్యలు తీసుకోవాలి. ఉప్పు ద్రావణం స్ప్రే చేయడం, కలుపు మందులు కొట్టడం వలన నివారించవచ్చు.
– డి.పద్మావతి, వ్యవసాయాధికారి, గార
పంట పొలాల్లో ఏపుగా పెరుగుతున్న కలుపు మొక్క
దిగుబడిపై తీవ్రమైన ప్రభావం
మనుషులకు సైతం వివిధ వ్యాధులు
వేర్లతో సహా తొలగించాలని అధికారుల సూచనలు


