● నా కుమార్తె చావుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోండి
● సీజీఎంను కలిసిన గార ఎస్‌బీఐ ఉద్యోగిని ఉరిటి స్వప్న తల్లి సరళ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పెద్దపాడు మార్గంలో ఉన్న శ్రీకాకుళం రీజనల్ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియాను చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ పాటిల్ సోమవారం సందర్శించారు. గార ఎస్‌బీఐ బ్యాంకులో జరిగిన తనఖా బంగారం మా యం కేసుకు ముందే అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు, బ్యాంకు ప్రతినిధులు అకౌంటెంట్ అయిన ఉరిటి స్వప్నప్రియపై ఆరోపణలు చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వప్నప్రియ తల్లి ఉరిటి సరళాదేవి సీజీఎం రాజేష్ కుమార్ పాటిల్‌ను కలసి తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కన్నీటిపర్యంతమై వివరించారు. దానికి స్పందించిన సీజీఎం జరిగిన విషయాలేవీ తనకు తెలియవని, కచ్చితంగా నిజా నిజాలు తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సరళా దేవికి మద్దతుగా బంధువులు అధికంగా రీజనల్ బ్యాంకుకు చేరుకున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో డీఎస్పీ సీహెచ్ వివేకానంద కేసు దర్యాప్తు నిర్వహించిన సంగతి తెలిసిందే.


