● అంపోలు సబ్ జైలుకు తరలింపు
● కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
వజ్రపుకొత్తూరు రూరల్: రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగం మేరకు కేసులో ఏ–4గా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రధాన అనుచరుడైన అల్లు వెంకటరమణకు పలాస జూనియర్ సివిల్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని అంపోలు జైలుకు మంగళవారం పోలీసులు తరలించారు. అల్లు వెంకట రమణను సోమ వారం రాత్రి ఆయన స్వగ్రామమైన లక్ష్మీపురంలో పోలీసులు అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి పోలీసు అదుపులో ఉన్న రమణను మంగళవారం సాయంత్రం పలాస కోర్టులో హాజరుపరిచారు. దీంతో పలాస కోర్టు అల్లు రమణకు 14 రోజులు రిమాండ్ విధించడంతో అంపోలు సబ్ జైలుకు తరలించారు.
అరెస్టుపై ఉద్రిక్తత
వెంకటరమణ అరెస్టుపై పలాస–కాశీబుగ్గలో ఉద్రి క్తత చోటు చేసుకుంది. వెంకటరమణను పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు కాళింగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు సోమవారం రాత్రి నుంచి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్‌లోకి మీడియాను, నాయకులను అనుమతించకపోవడంతో స్టేషన్ లోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. మంగళవారం ఉద యం సైతం నాయకులు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వెంకటరమణను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో స్టేషన్ వెలుపల నాయకులు రమణ రాక కోసం ఎదురు చూశారు. అప్పటికే మోహ రించిన పోలీసులు నాయకులను అక్కడ నుంచి పంపించేయడంతో వారు వెనుదిరిగారు. కూటమి కక్షపూరిత రాజకీయాలపై నాయకులు మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని రోడ్డు ప్ర మాదాలకు పోలీసులు ఇదే తీరున వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించారు.


