షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూ ల్డ్‌ కులాల సహకార ఆర్థిక సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ యువతీ యువకులకు వివిధ సాంకేతిక, వృత్తి విద్యా విభాగాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులముల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు (ఈడీ) వినాయకం మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు. కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ మెయింటెనెన్స్‌, మొబైల్‌ ఫోన్‌ రిపేర్‌, సోలార్‌ టీవీ ఇన్‌స్టాలర్‌, సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌, స్టిచింగ్‌ ఆపరేటర్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌, టెలికామ్‌ కస్టమర్‌ కేర్‌, ఫుడ్‌ – బెవరేజ్‌, ఇజ్రాయెల్‌ హోమ్‌ మేడ్‌ హెల్పర్‌ తదితర 14 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సు ను బట్టి 8, 9, 10, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, నర్సింగ్‌ అర్హతలు ఉండి 18–40 ఏళ్లు (హోమ్‌ మేడ్‌ హెల్పర్‌ కోర్సుకు 25–45 ఏళ్లు) ఉన్నవారు అర్హులు. 60 నుంచి 100 రోజుల వ్యవధితో ఉండే ఈ శిక్షణ పూర్తయిన వెంటనే అభ్యర్థులకు ప్రముఖ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన జిల్లాలోని అర్హులైన ఎస్సీ యువతీ యువకులు తమ దరఖాస్తులను ఆగస్టు 31, 2026 లోగా శ్రీకాకుళం కలెక్టర్‌ ఆఫీస్‌ వద్దగల తారకరామ సముదాయ భవనంలో ఉన్న జిల్లా షెడ్యూల్డ్‌ కులముల సేవా సహకార సంస్థ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 08942–240598 నంబర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు చెప్పండి: కలెక్టర్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్‌ స్వప్ని ల్‌ దినకర్‌ పుండ్కర్‌ రాజకీయ పార్టీలను కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక జాబితా సవరణపై ఆయన మంగళవారం వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో స్వీకరించిన ఫారాల వివరాలను నియోజకవర్గాల వారీగా తెలియజేశారు. జారీ చేసిన 1,16,258 నోటీసులకు బీఎల్‌ఓ ద్వారా డాక్యుమెంటేషన్‌ అప్‌డేషన్‌ పూర్తి చేసినవి నేటి వరకు 51,878 ఉన్నట్టు వివరించారు. నియోజవర్గాల్లో అప్‌డేషన్‌ చేయాల్సిన వారు ఇంకెవరైనా ఉంటే వారిని సత్వరమే అప్‌డేషన్‌ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని పొలిటికల్‌ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆర్‌.శంకరరావు, దామా మన్మధరావు, టీడీపీ నుంచి పీఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు.

గొట్టా బ్యారేజీ పరిశీలన

హిరమండలం: గొట్టా బ్యారేజీని మంగళవారం జలవనరుల శాఖ ఉత్తరాంధ్ర చీఫ్‌ ఇంజినీర్‌ వేణుగోపాల్‌ ఎస్‌ఈ రామచంద్ర పరిశీలించా రు. ఇటీవల కురిసిన వర్షాలకు గొట్టా బ్యారేజీలో వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో చీఫ్‌ ఇంజినీర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గొట్టా బ్యారేజీ నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. గొట్టా బ్యారేజీ పనితీరును.. కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో నీటి ప్రవాహం, వాటి దుస్థితిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీ నిర్వహణలో ఎలాంటి అలసత్వం వద్దన్నారు. కాలువలకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. అలాగే వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బ్యారేజీలో నీటి స్థిరీకరణ జరపాలని సూచించారు. వారి వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement