నందిగాం: మండలంలోని రథజన బొడ్డపాడుకు చెందిన మాజీ సర్పంచ్ అంబలి సోమేశ్వరరావు(65) ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సోమేశ్వరరావు వ్యవసాయం, గొర్రెల పెంపకం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించిన సోమేశ్వరరావు ఇటీవల ఆర్థికంగా ఇబ్బందిపడి అప్పులు చేశారు. వీటిని తీర్చే మార్గం లేక ఈనెల 21న ఇంట్లో ఉన్న పురుగుల మందును బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి తాగారు. దీన్ని గమనించిన కుమారులు హుటాహుటిన టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. మృతుడికి భార్య పార్వతి, అయిన ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని కుమారుడు మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్‌ఐ షేక్ మహ్మద్ అలీ కేసు నమోదు చేశారు.


