శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం పట్టణం దరిలో ఉన్న పొన్నాడ గ్రామానికి చెందిన ఇప్పిలి లక్ష్మి(74) ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఇప్పిలి కుమార్ రాజు, ఇప్పిలి మురళి కృష్ణ, ఇప్పిలి లక్ష్మణరావులు రెడ్‌క్రాస్ నేత్ర సేకరణ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. జిల్లా రెడ్‌క్రాస్ సమన్వయంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, బి.మనుకుమార్‌లు కార్నియాలను సేకరించి, వాటిని విశాఖలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. నేత్రదానానికి సహకరించిన కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్‌లు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పలాస జీఆర్పీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయస్సు 45–50 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, ఆ వ్యక్తి సిమ్మెంట్ రంగు షార్ట్, నీలం రంగు, తెలుపు చెక్స్ ఉన్న షర్ట్ వేసుకుని ఉన్నాడని తెలిపారు. అయితే ఈ వ్యక్తి మంగళవారం గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి శవపంచనామ నిమిత్తం తరలించారు. మృతుని వివరాలు తెలిసినట్లయితే పలాస జీఆర్పీ ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు ఫోన్ 92475 85743 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
బెయిల్ పిటిషన్‌పై విచారణ నేడు
సోంపేట: రాష్ట్ర మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు బెయిల్ కోసం 3వ సారి సోంపేట కోర్టులో న్యాయవాది ఈనెల 10వ తేదీన పిటిషన్ వేశారు. ఈ మేరకు బుధవారం విచారణ జరగనున్నట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు.
హెల్మెట్‌ధారణపై అవగాహన
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఒకటి, రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ధారణపై పోలీసులు మంగళవారం విస్తృత అవగాహన కల్పించారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు, ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణలు వాహనదారులతో మాట్లాడి రహదారి నిబంధనలు, అభయం హెల్మెట్ బ్యాంకులపై తెలియజేశారు.
స్పోర్ట్స్ డీన్‌గా భాస్కర్
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ విభాగం డీన్‌గా డాక్టర్ అంకెం భాస్కర్ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కె.రజనీ మంగళవారం ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. వర్సిటీలో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా సేవలను అందిస్తున్నారు.


