భారత్‌ తొలి ప్రత్యర్థి శ్రీలంక | Womens World Cup 2025 Schedule Revealed | Sakshi
Sakshi News home page

భారత్‌ తొలి ప్రత్యర్థి శ్రీలంక

Jun 17 2025 4:50 AM | Updated on Jun 17 2025 4:50 AM

Womens World Cup 2025 Schedule Revealed

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదల

సెప్టెంబర్‌ 30 నుంచి టోర్నీ

నవంబర్‌ 2న ఫైనల్‌ 

ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వైజాగ్‌  

దుబాయ్‌: భారత గడ్డపై మరోసారి మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 30 నుంచి నవంబర్‌ 2 వరకు వేర్వేరు వేదికలపై ఈ టోర్నమెంట్‌ జరుగుతుంది. గతంలో 1978, 1997, 2013లలో భారత్‌ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈసారి శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టోర్నీని నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 30న తొలి మ్యాచ్‌ జరగనుండగా, నవంబర్‌ 2న జరిగే ఫైనల్‌తో వరల్డ్‌ కప్‌ ముగుస్తుంది.

 28 లీగ్‌ మ్యాచ్‌లు, 3 నాకౌట్‌ మ్యాచ్‌లు కలిపి మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో భారత్‌లోని నాలుగు వేదికలు బెంగళూరు, ఇండోర్, గువహటి, విశాఖపట్నంలతో పాటు శ్రీలంకలోని కొలంబో స్టేడియం కూడా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. ప్రపంచ కప్‌లో 8 జట్లు పాల్గొంటుండగా... ఎప్పటిలాగే రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ప్రతీ టీమ్‌ మిగతా 7 ప్రత్యర్థులతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. 

ఇప్పటి వరకు మొత్తం 12 వరల్డ్‌ కప్‌లు జరగ్గా భారత్‌ 10 టోర్నీల్లో పాల్గొంది. ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గలేకపోయిన మన టీమ్‌... రెండుసార్లు (2005, 2017) ఫైనల్‌ వరకు చేరడమే అత్యుత్తమ ప్రదర్శన. సెప్టెంబర్‌ 30న బెంగళూరు వేదికగా జరిగే తొలి పోరులో శ్రీలంకతో భారత్‌ తలపడుతుంది. సొంతగడ్డపై ఈసారైనా మన మహిళలు సత్తా చాటి ట్రోఫీ సాధిస్తారా అనేది ఆసక్తికరం. వరల్డ్‌ కప్‌లో భాగంగా సాగర తీరం విశాఖపట్నంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్‌ ఆడే 2 మ్యాచ్‌లు ఉండటం విశేషం.  

శ్రీలంకలో పాకిస్తాన్‌ మ్యాచ్‌లు
పురుషుల క్రికెట్‌ తరహాలో మహిళల క్రికెట్‌లోనూ భారత్, పాకిస్తాన్‌ జట్లు ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య అక్టోబర్‌ 5న జరిగే పోరుకు కొలంబో వేదికవుతోంది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇటీవలి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇలాంటి సమయంలో ఐసీసీ టోర్నీలోనూ భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగుతుందా అనే సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా షెడ్యూల్‌ ప్రకటనతో మ్యాచ్‌ ఖాయమైనట్లు తేలింది.

 ఈ ఏడాది పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీకి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా... భారత్‌ మాత్రం అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. ఫలితంగా మన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరిగాయి. దాంతో తాము కూడా మహిళల వరల్డ్‌ కప్‌కు భారత్‌కు రాలేమని, మరో చోట మ్యాచ్‌లు జరపాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు డిమాండ్‌  చేసింది. దీనికి అంగీకరించిన ఐసీసీ పాక్‌ మ్యాచ్‌లను తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించింది. పాక్‌ సెమీస్‌ చేరితే కొలంబోలో మ్యాచ్‌ ఆడుతుంది. లేదంటే తొలి సెమీస్‌ గువహటిలో జరుగుతుంది. అదే తరహాలో పాక్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మ్యాచ్‌ కొలంబోలోనే నిర్వహి స్తారు. పాక్‌ చేరకపోతే ఫైనల్‌ బెంగళూరులో జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement