breaking news
Robin league system
-
భారత్ తొలి ప్రత్యర్థి శ్రీలంక
దుబాయ్: భారత గడ్డపై మరోసారి మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీకి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు వేర్వేరు వేదికలపై ఈ టోర్నమెంట్ జరుగుతుంది. గతంలో 1978, 1997, 2013లలో భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈసారి శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టోర్నీని నిర్వహించనుంది. సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్ జరగనుండగా, నవంబర్ 2న జరిగే ఫైనల్‌తో వరల్డ్ కప్ ముగుస్తుంది. 28 లీగ్ మ్యాచ్‌లు, 3 నాకౌట్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో భారత్‌లోని నాలుగు వేదికలు బెంగళూరు, ఇండోర్, గువహటి, విశాఖపట్నంలతో పాటు శ్రీలంకలోని కొలంబో స్టేడియం కూడా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. ప్రపంచ కప్‌లో 8 జట్లు పాల్గొంటుండగా... ఎప్పటిలాగే రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ప్రతీ టీమ్ మిగతా 7 ప్రత్యర్థులతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ఇప్పటి వరకు మొత్తం 12 వరల్డ్ కప్‌లు జరగ్గా భారత్ 10 టోర్నీల్లో పాల్గొంది. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయిన మన టీమ్... రెండుసార్లు (2005, 2017) ఫైనల్ వరకు చేరడమే అత్యుత్తమ ప్రదర్శన. సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా జరిగే తొలి పోరులో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. సొంతగడ్డపై ఈసారైనా మన మహిళలు సత్తా చాటి ట్రోఫీ సాధిస్తారా అనేది ఆసక్తికరం. వరల్డ్ కప్‌లో భాగంగా సాగర తీరం విశాఖపట్నంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ ఆడే 2 మ్యాచ్‌లు ఉండటం విశేషం. శ్రీలంకలో పాకిస్తాన్ మ్యాచ్లుపురుషుల క్రికెట్ తరహాలో మహిళల క్రికెట్లోనూ భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 5న జరిగే పోరుకు కొలంబో వేదికవుతోంది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇలాంటి సమయంలో ఐసీసీ టోర్నీలోనూ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా అనే సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకటనతో మ్యాచ్ ఖాయమైనట్లు తేలింది. ఈ ఏడాది పురుషుల చాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా... భారత్ మాత్రం అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. ఫలితంగా మన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరిగాయి. దాంతో తాము కూడా మహిళల వరల్డ్ కప్‌కు భారత్‌కు రాలేమని, మరో చోట మ్యాచ్‌లు జరపాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించిన ఐసీసీ పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించింది. పాక్ సెమీస్ చేరితే కొలంబోలో మ్యాచ్ ఆడుతుంది. లేదంటే తొలి సెమీస్ గువహటిలో జరుగుతుంది. అదే తరహాలో పాక్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మ్యాచ్ కొలంబోలోనే నిర్వహి స్తారు. పాక్ చేరకపోతే ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. -
Norway Chess 2022: ఆనంద్‌కు మూడో స్థానం
స్టావెంజర్: నార్వే ఓపెన్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మూడో స్థానంతో ముగించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో 52 ఏళ్ల ఆనంద్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్, కార్ల్సన్ (నార్వే) 16.5 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకోగా... మమెదైరోవ్ (అజర్బైజాన్) 15.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. చాంపియన్ కార్ల్‌సన్‌కు 7,50,000 నార్వే క్రోన్లు (రూ. 60 లక్షల 36 వేలు), రన్నరప్ మమెదైరోవ్కు 4,00,000 నార్వే క్రోన్లు (రూ. 32 లక్షల 19 వేలు), మూడో స్థానంలో నిలిచిన ఆనంద్‌కు 2,50,000 నార్వే క్రోన్లు (రూ. 20 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఆనంద్‌కు తొమ్మిదో స్థానం
* లండన్ క్లాసిక్ చెస్ టోర్నీ * చాంపియన్ కార్ల్సన్ లండన్: ప్రపంచ చెస్ మాజీ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2015 సీజన్‌ను నిరాశజనకంగా ముగించాడు. లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్లో ఆనంద్ 3.5 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిదైన తొమ్మిదో రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో తలపడిన ఆనంద్ గేమ్‌ను 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత కార్ల్సన్, అనీష్ గిరి, మాక్సిమి వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా కార్ల్సన్ నేరుగా ఫైనల్‌కు వెళ్లగా... అనీష్, లాగ్రెవ్ మధ్య సెమీఫైనల్‌ను నిర్వహించారు. సెమీస్‌లో లాగ్రెవ్ 2-1తో అనీష్ గిరిని ఓడించి కార్ల్సన్తో ఫైనల్లో తలపడ్డాడు. ర్యాపిడ్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో కార్ల్ సన్ 1.5.-0.5తో లాగ్రెవ్ను ఓడించి లండన్ క్లాసిక్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ టైటిల్‌తోపాటు గ్రాండ్ చెస్ టూర్లోనూ కార్ల్‌సన్‌కే టైటిల్ దక్కింది. నార్వే ఓపెన్, సింక్యూఫీల్డ్ కప్, లండన్ క్లాసిక్ టోర్నీలను కలిపి గ్రాండ్ చెస్ టూర్‌గా పరిగణించారు. ఈ మూడు టోర్నీల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా కార్ల్సన్ మొత్తం 26 పాయింట్లతో విజేతగా నిలిచాడు. ఆనంద్ 14 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.