టీమిండియా (PC: BCCI)
టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు.. అనూహ్య రీతిలో తొలి టీ20లో ఓటమి పాలైంది. ఆటలో గెలుపోటములు సహజం.. రెండో మ్యాచ్‌లోనైనా తప్పు దిద్దుకుంటారని భావించిన అభిమానులకు మరోసారి భంగపాటే ఎదురైంది.
ఒక్క పరుగు తేడాతో..
తాజాగా రెండో టీ20 మ్యాచ్‌లోనూ శ్రేయస్ అయ్యర్ సేన ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలై.. సిరీస్‌ను చేజార్చుకుంది. ఇక ఐర్లాండ్ తొలిసారి టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి తమ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించింది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మరోసారి విమర్శకులకు టార్గెట్ అయ్యాడు. ఆల్‌రౌండర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామంటే ఫలితం ఇలాగే ఉంటుందంటూ గంభీర్‌కు మాజీ క్రికెటర్లు చురకలు అంటిస్తున్నారు.
మిడిలార్డర్‌లో నిఖార్సైన బ్యాటర్ కావాలి
ఐర్లాండ్ చేతిలో టీమిండియా పరాభవం నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం గంభీర్‌పై విమర్శనా బాణాలు ఎక్కుపెట్టాడు. ‘‘గంభీర్ మార్గదర్శనంలో ఇది జరిగింది. అయితే, ఇప్పుడే ఓ అంచనాకు రాకూడదు. కానీ ఇక్కడ ఆల్‌రౌండర్లకే ప్రాధాన్యం కదా!..
నిజానికి టీమిండియాకు మిడిలార్డర్‌లో నిఖార్సైన బ్యాటర్ అవసరం ఉంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. ఇక తమదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను అలరించే ఐస్‌లాండ్ క్రికెట్ సైతం ఈసారి గంభీర్ పట్ల కాస్త వ్యంగ్యంగానే స్పందించింది.
మాకు కోచ్‌గా వద్దు
‘‘గౌతం గంభీర్‌ను మా జట్టుకు హెడ్‌కోచ్‌గా కోరుకోవడం లేదని ధ్రువీకరిస్తున్నాం. అతడు గొప్ప ప్రతిభావంతుడు. అయినప్పటికీ మాకైతే వద్దు. ఐర్లాండ్‌లో ఏదైతే జరిగిందో.. నిజంగా ఆ ఫలితాలు నిజంగా చిరకాలం గుర్తుండిపోయే బహుమతులు’’ అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్లు వేసింది.
ఛీ.. ఆఖరికి వీళ్లకూ లోకువైపోయాం!
దీంతో.. ‘ఛీ.. ఆఖరికి అనామక క్రికెట్ బోర్డు చేతిలోనూ మాటలు పడేలా చేశారు’ అంటూ గంభీర్, ఆటగాళ్లపై భారత జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కాగా బెల్‌ఫాస్ట్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా.. ఐర్లాండ్‌ను 154 పరుగులకు కట్టడి చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన భారత్.. ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది.
చదవండి: అభిషేక్, సంజూ వల్ల టీమిండియాకు అప్రతిష్ట
We can confirm that we don't wish to add Gautam Gambhir to our coaching staff. He clearly has talent, though. To take those Indian players and deliver those results in Ireland takes truly remarkable gifts.
— Iceland Cricket (@icelandcricket) June 28, 2026


