మళ్లీ నగుబాటే... | IND vs IRE 2nd T20I: Ireland Beat India Clinch Series | Sakshi
Sakshi News home page

మళ్లీ నగుబాటే...

Jun 28 2026 10:21 PM | Updated on Jun 29 2026 3:22 AM

IND vs IRE 2nd T20I: Ireland Beat India Clinch Series

రెండో టి20లోనూ ఐర్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి

2–0తో సిరీస్‌ నెగ్గిన ఐర్లాండ్‌

మెరిసిన జై ముంద్రా, హోలార్డ్‌

తిలక్‌ వర్మ పోరాటం వృథా  

బెల్‌ఫాస్ట్‌: ఐర్లాండ్‌ పర్యటనలో భారత పురుషుల క్రికెట్‌ జట్టు పూర్తిగా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు ఛేదించలేక చతికిలబడిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో చిన్న లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. ఆదివారం జరిగిన రెండో టి20లో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఐర్లాండ్‌ చేతిలో ఓడింది. దీంతో ఐర్లాండ్‌ 2–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. ఏ ఫార్మాట్‌లోనైనా ఐర్లాండ్‌కు టీమిండియాపై ఇదే తొలి సిరీస్‌ విజయం కాగా... టి20ల్లో వరుసగా 16 సిరీస్‌ విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్‌ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌సెంచరీ సాధించగా... బెన్‌ కాలిట్జ్‌ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. భారత బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... శివమ్‌ దూబే రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (46 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. 

ఐర్లాండ్‌ బౌలర్లలో జై ముంద్రా, హోలార్డ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ముంద్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్‌ ద్వారా భారత యువ పేసర్‌ ప్రిన్స్‌ యాదవ్, ఆల్‌రౌండర్‌ సూర్యాన్ష్ షెడ్గే అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేయగా... 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీకి మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. ఐర్లాండ్‌ పర్యటనను ముగించుకున్న భారత్‌... బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొననుంది. 

పారని అయ్యర్‌ పాచిక 
ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయగల సమర్థులు ఉన్నారనే నమ్మకంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌ మాదిరిగానే ఈ సారి కూడా మన బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు. టిమ్‌ టెక్టర్‌ (5), రాస్‌ అడెయిర్‌ (16; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు నిలవలేకపోవడంతో... 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ టకర్‌ (15) కూడా విఫలం కాగా... ఈ దశలో కాలిట్జ్‌ అండతో హ్యారీ టెక్టర్‌ కీలక పరుగులు సాధించాడు. 

చాపకింద నీరులా ముందుకు సాగిన టెక్టర్‌ జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి ఓవర్‌లో వెనుదిరిగాడు. టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్‌ అయ్యర్‌... తాజా ఐపీఎల్‌ అనంతరం అనూహ్య పరిణామాల మధ్య జట్టులోకి రావడంతో పాటు సారథ్య అవకాశం కూడా దక్కించుకున్నా మైదానంలో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్‌లు తీస్తున్న హర్షిత్‌ రాణా కోటా పూర్తి చేయించలేకపోయిన శ్రేయస్‌... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.  

అభిషేక్, సామ్సన్‌ గోల్డెన్‌ డక్‌... 
ఈ మ్యాచ్‌లోనూ ఛేదనకే మొగ్గు చూపిన టీమిండియాకు తొలి ఓవర్‌లోనే డబుల్‌ షాక్‌ తగిలింది. టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’గా నిలిచిన సంజూ సామ్సన్‌ (0) ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోగా... నాలుగో బంతికి అభిషేక్‌ శర్మ (0) కూడా ‘గోల్డెన్‌ డకౌట్‌’గా వెనుదిరిగాడు. మూడో ఓవర్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (10) కూడా అవుటయ్యాడు. ఈ మూడు వికెట్లు జై ముంద్రా ఖాతాలోకే వెళ్లాయి. ఇషాన్‌ కిషన్‌ (12) రనౌట్‌ రూపంలో వెనుదిరిగడంతో భారత జట్టు 35/4తో పీకల్లోతూ కష్టాల్లో పడింది. 

గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో జట్టును గెలిపించిన అనుభవం ఉన్న హైదరాబాద్‌ ప్లేయర్‌ తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యత తీసుకోగా... అతడికి అక్షర్‌ పటేల్‌ (14), శివమ్‌ దూబే (20) కాస్త సహకరించారు. దీంతో జట్టు గాడినపడ్డట్లే అనుకుంటుండగా... 18వ ఓవర్‌ రెండో బంతికి తిలక్‌ అవుటయ్యాడు. అరంగేట్ర ఆటగాడు సూర్యాన్ష్ (1) ప్రభావం చూపలేకపోగా... హర్షిత్‌ రాణా (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ప్రిన్స్‌ (6 నాటౌట్‌) సిక్స్‌ కొట్టినా అప్పటికే 
ఆలస్యమైపోయింది.

స్కోరు వివరాలు  
ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: టిమ్‌ టెక్టర్‌ (సి) అభిషేక్‌ (బి) రాణా 5; అడెయిర్‌ (సి) తిలక్‌ (బి) అర్ష్ దీప్  16; హ్యారీ టెక్టర్‌ (సి) ఇషాన్‌ (బి) ప్రిన్స్‌ 53; టకర్‌ (సి) ఇషాన్‌ (బి) ప్రిన్స్‌ 15; కాలిట్జ్‌ (సి) తిలక్‌ (బి) దూబే 37; డెలానీ (బి) దూబే 0; డాక్‌రెల్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్  19; మెక్‌కార్టీ (సి) ఇషాన్‌ (బి) ప్రిన్స్‌ 2; జై ముంద్రా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–48, 4–113, 5–113, 6–144, 7–153, 8–154. బౌలింగ్‌: అర్ష్ దీప్  4–0–35–2; హర్షిత్‌ రాణా 3–0–17–1; ప్రిన్స్‌ 4–0–22–3; శివమ్‌ దూబే 3–0–25–2; సూర్యాన్ష్ 2–0–25–0; అక్షర్‌ 4–0–28–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: సామ్సన్‌ (ఎల్బీ) (బి) ముంద్రా 0; అభిషేక్‌ (సి) హోలార్డ్‌ (బి) ముంద్రా 0; ఇషాన్‌ (రనౌట్‌) 12; శ్రేయస్‌ (బి) ముంద్రా 10; తిలక్‌ (సి) మెక్‌కార్టీ (బి) హోలార్డ్‌ 55; అక్షర్‌ (సి) టకర్‌ (బి) హోలార్డ్‌ 14; శివమ్‌ దూబే (సి) డాక్‌రెల్‌ (బి) హంఫ్రీస్‌ 20; సూర్యాన్ష్ (సి) టిమ్‌ టెక్టర్‌ (బి) హోలార్డ్‌ 1; హర్షిత్‌ రాణా (సి) టిమ్‌ టెక్టర్‌ (బి) హ్యారీ టెక్టర్‌ 21; అర్ష్ దీప్  (నాటౌట్‌) 4; ప్రిన్స్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–19, 4–35, 5–74, 6–109, 7–117, 8–121, 9–147. బౌలింగ్‌: జై ముంద్రా 4–0–32–2; హంఫ్రీస్‌ 4–0–28–1; హోలార్డ్‌ 4–0–26–3; మెక్‌కార్టీ 4–0–22–0; హ్యారీ టెక్టర్‌ 4–0–40–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement