భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ఎ’ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మంగళవారం నాటి వన్డేలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు ఈ లెప్టాండర్ బ్యాటర్.
వైభవ్ విఫలం
ఆరంభంలో బౌండరీలతో అలరించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. కాసేపటికే అవుటై ఉసూరుమనిపించాడు. మొత్తంగా 12 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో కేవలం 14 పరుగులు చేసి మహ్మద్ షిరాజ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఇక మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2) విఫలమయ్యాడు.
Bossing From Ball 1 😎
Vaibhav Sooryavanshi - making a 𝙍𝙐𝙏𝙃𝙇𝙀𝙎𝙎 entry on the world stage. 💥 #SonySportsNetwork #SonyLIV #TalentTVCup #TeamIndia #SLvIND pic.twitter.com/tLBkRO2ySF— Sony Sports Network (@SonySportsNetwk) June 9, 2026
రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ
సాధారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగే ప్రియాన్ష్ ఆర్య లంకతో మ్యాచ్‌లో మూడో స్థానంలో వచ్చి (32 బంతుల్లో 32) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ విఫలమైనా నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(101)తో రాణించడంతో భారత్ గట్టెక్కింది. నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులు చేయగలిగింది.
అయితే, విజయం కోసం మాత్రం చివరి వరకు తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 47 ఓవర్లు ముగిసే సరికి లంక 261/6తో పటిష్టంగా ఉంది. ఆఖరి మూడు ఓవర్లలో 17 పరుగులే రావాల్సి ఉండగా.. విజయం లాంఛనమే అనుకున్నారు.
బౌలర్ల విజృంభణతో..
కానీ భారత బౌలర్లు ఆఖర్లో పది బంతుల్లోనే నాలుగు వికెట్లు కూల్చి ఆతిథ్య లంక జట్టు ఓటమిని శాసించారు. అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్, ఆయుశ్ బదోని, విప్రాజ్ నిగమ్ రెండేసి వికెట్లు తీయగా... అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.
ఇక తమ రెండో మ్యాచ్‌లో భాగంగా భారత్- ‘ఎ’ జట్టు గురువారం అఫ్గనిస్తాన్-‘ఎ’ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ఓపెనర్లుగా వైభవ్, ప్రభ్‌సిమ్రన్ విఫలమైనా వారిద్దరిని కొనసాగించాలని నాయకత్వ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా లంకపై గెలిచిన తుది జట్టుతోనే భారత్ అఫ్గన్‌తో వన్డే బరిలోనూ దిగనున్నట్లు తేలిపోయింది.
అఫ్గనిస్తాన్-‘ఎ’తో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)
వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ (కెప్టెన్), ఆయుశ్ బదోని, అనుకుల్ రాయ్, సూయాన్ష్ షెడ్గే, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, విప్రాజ్ నిగమ్.


