వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? | Aakash Chopra Defends Selectors Amid Criticism Over Snub To Rajat Patidar In India’s T20 Squad, Read Story For More Details | Sakshi
Sakshi News home page

ఇంకెన్ని మార్పులు?.. అందుకే అతడిని సెలక్ట్‌ చేయలేదు!

Jun 10 2026 1:32 PM | Updated on Jun 10 2026 2:24 PM

How many more changes: Aakash Chopra on Rajat Patidar non selection

రజత్‌ పాటిదార్‌ (PC: BCCI/RCB)

టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలతో పాటు.. ఆసియా క్రీడలు-2026 టోర్నీకి ప్రకటించిన టీ20 జట్టులో అర్హులకు చోటు దక్కలేదని మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హర్షిత్‌ రాణా వంటి ఆటగాళ్లు కేవలం హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ వల్లే జట్టులో ఉన్నారని పెదవి విరుస్తున్నారు.

ఇంతకంటే ఇంకేం చేయాలి?
గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో సత్తా చాటుతూ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)కి వరుసగా రెండుసార్లు టైటిల్‌ అందించిన రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar)ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఆర్సీబీ స్టార్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. భారత టీ20 జట్టులో పాటిదార్‌కు చోటిచ్చేందుకు ఆస్కారం లేదని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌-2026 గెలిచిన జట్టు నుంచి చాలా మందిని తప్పించారని.. పాటిదార్‌ కోసం ఈ సంఖ్యను మరింత పెంచలేరని పేర్కొన్నాడు.

ఆవేదన అర్థం చేసుకోగలను!.. కానీ
ఈ మేరకు.. ‘‘భారత టీ20 జట్టులో రజత్‌ పాటిదార్‌ ఎందుకు లేడు? అతడు కచ్చితంగా జట్టులో ఉండాలి కదా!.. ఇంతకంటే గొప్పగా ఏ ఆటగాడైనా ఏం చేయగలడు?.. చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

భజ్జీ (హర్భజన్‌ సింగ్‌) కూడా ఇలాగే ట్వీట్‌ చేశాడు. భజ్జీతో నేనూ ఏకీభవిస్తాను. అందరి మనసుల్లోనూ ఇదే భావన ఉంది. అర్హుడైనా అతడికి స్థానం దక్కలేదన్న ఆవేదనను నేనూ అర్థం చేసుకోగలను.

అయితే, ఇక్కడ భావోద్వేగాల కంటే కూర్పుకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రజత్‌ పాటిదార్‌కు చోటివ్వాలంటే ఎవరో ఒకరిని తీసేయాల్సి ఉంటుంది. మరి అతడి కోసం ఎవరిని బలి చేయాలంటారు?

వాళ్లకే దిక్కులేదు.. అతడికి చోటు ఎలా?
ప్రపంచకప్‌ గెలిచిన జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పైనే వేటు వేశారు. అతడితో పాటు రింకూ సింగ్‌నూ తప్పించారు. వీరిద్దరి స్థానంలో కొత్త సారథిగా శ్రేయస్‌ అయ్యర్‌, ఆటగాడిగా వైభవ్‌ సూర్యవంశీ జట్టులోకి వచ్చారు.

ఇంతకంటే ఇంకెన్ని మార్పులు చేయాలి? ప్రపంచకప్‌ గెలిచిన జట్టు నుంచి ఇంకెంత మంది సభ్యులను నిర్దాక్షిణ్యంగా తప్పించాలి?’’ అని ఆకాశ్‌ చోప్రా విమర్శకులను ప్రశ్నించాడు.

సారథిగా సరైనోడు
ఏదేమైనా శ్రేయస్‌ అయ్యర్‌ సారథిగా సరైనోడని.. అందుకే మూడేళ్ల తర్వాత ఏకంగా కెప్టెన్‌గా టీ20 జట్టులో పునరాగమనం చేశాడని ఆకాశ్‌ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్‌ గెలిచిన 35 ఏళ్ల సూర్యతో పాటు రింకూ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌లపై సెలక్టర్లు వేటు వేశారు.

మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయితే, బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు మాత్రం ఎంపిక చేశారు. కొత్తగా శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ జట్టులోకి రాగా.. రవి బిష్ణోయి, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ప్రిన్స్‌ యాదవ్‌లకు కూడా చోటు దక్కింది.

చదవండి: ‘అతడు పేరుకే ఆల్‌రౌండర్‌.. జట్టులో చోటు దండగ’

Advertisement
 
Advertisement
Advertisement