ఓటమి అంచుల నుంచి... | Sri Lanka A team lost by 8 runs on India A | Sakshi
Sakshi News home page

ఓటమి అంచుల నుంచి...

Jun 10 2026 3:06 AM | Updated on Jun 10 2026 3:06 AM

Sri Lanka A team lost by 8 runs on India A

భారత్‌ ‘ఎ’ అద్భుత విజయం

ఆఖర్లో 10 బంతుల్లో 4 వికెట్లు 

ఒత్తిడికి చిత్తయి ఓడిన శ్రీలంక ‘ఎ’

రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీ

14 పరుగులు చేసిన వైభవ్‌ సూర్యవంశీ

దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్‌ సహాన్‌ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్‌ కంబోజ్‌... ప్రత్యర్థి కెప్టెన్‌ను అవుట్‌ చేయగా... అర్షద్‌ ఖాన్‌ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 

అంతకుముందు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్‌ తిలక్‌ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో వైభవ్‌... ఐపీఎల్‌ జోరు కనబర్చలేకపోయాడు. 

ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ఆయుశ్‌ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్‌తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్‌ ఖాన్, అనుకూల్‌ రాయ్, ఆయుశ్‌ బదోనీ, విప్రాజ్‌ నిగమ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్‌ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ ‘ఎ’తో భారత్‌ ‘ఎ’ తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement