శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఫిట్‌నెస్ సమస్యలు
గాయాలతో నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా సెలక్షన్‌కు దూరం
స్టార్ పేసర్ బుమ్రా సైతం కష్టమే
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్‌లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.
దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్‌నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్‌యాదవ్‌తో పాటు... నాలుగో స్పిన్నర్‌గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్‌లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్‌ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్‌నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది.
హార్దిక్ ఆగస్టు తర్వాతే...
మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్‌లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్‌నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.


