ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ శుభారంభం చేసింది. గురువారం బులవాయో వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా భారత బౌలర్లు చెలరేగడంతో 35.2 ఓవర్లలో కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. పేసర్ హేనిల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. హెనిల్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
అతడితో పాటు దీపేష్, అబ్రిష్, ఖిలాన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలా వికెట్ సాధించారు. అమెరికా బ్యాటర్లలో నితీష్ సుదిని (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్ణయించారు.
ఈ టార్గెట్‌ను భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. వైభవ్ సూర్యవంశీ(2), అయూశ్ మాత్రే(19), త్రివేది(2) నిరాశపరిచినప్పటికి.. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (42) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అమెరికా బౌలర్లలో రిత్విక్ రెండు వికెట్లు పడగొట్టగా.. రిషబ్ షింపి ఒక్క వికెట్ సాధించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 17న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
చదవండి: BCB: ఆటగాళ్ల తిరుగు బాటు..! కీలక అధికారిపై వేటు వేసిన బీసీబీ


