బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన బోర్డు ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్, డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను తన పదవి నుంచి బీసీబీ తొలగించింది. అతడి స్ధానంలో బీసీబీ చైర్మెన్ అమీనుల్ ఇస్లాం తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే.
వివాదానికి కారణం ఏంటంటే?
ఐపీఎల్-2026 నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో తమ జట్టుకు భద్రత లేదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ-బీసీబీ మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయి.
అయితే ఈ వివాదంపై బంగ్లా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు. తమీమ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు.
ఈ క్రమంలో 16 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆటగాడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. చాలా మంది క్రికెటర్లు కూడా అతడి వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత మరోసారి నజ్ముల్ ఇస్లాం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
"ఒకవేళ బంగ్లా క్రికెట్ జట్టు వరల్డ్ కప్‌లో ఆడకపోయినా బోర్డుకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఐసీసీ నుంచి రావాల్సిన రూ. 290 కోట్ల రెవెన్యూ ఎలాగూ వస్తుంది. కానీ ఆటగాళ్లే నష్టపోతారు. వారు ఈ అవకాశాన్ని కోల్పోతే ఎలాంటి పరిహారం ఉండదు. బోర్డు ఆటగాళ్లపై కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది.
కానీ ప్రతీ ఐసీసీ టోర్నీలో జట్టు విఫలమవుతోంది. అటువంటి సందర్భాల్లో బోర్డు వారిపై ఖర్చు చేసే డబ్బులను తిరిగి చెల్లించమని మేము అడగడం లేదు కదా?" అని నజ్ముల్ పేర్కొన్నాడు. దీంతో అతడి కామెంట్స్‌పై క్రికెటర్ల సంక్షేమ సంఘం మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: IND vs USA: వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్..
నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు. నజ్ముల్ ఇస్లాంకు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికి బంగ్లా ప్లేయర్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో గురువారం జరగాల్సిన రెండు బీపీఎల్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో బోర్డు పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నజ్ముల్ ఇస్లాంపై వేటు వేశారు.


