అభిజ్ఞాన్, వైభవ్- థామస్
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 వార్మప్ మ్యాచ్‌లో యువ భారత జట్టుకు పరాభవం ఎదురైంది. సన్నాహక మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించిన మాత్రే సేన.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. మెరుగైన స్కోరు సాధించినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిలపడింది.
జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం భారత్- ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం బులవాయో వేదికగా సన్నాహక మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
అభిజ్ఞాన్ కుందు హాఫ్ సెంచరీ
ఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49) మెరుగ్గా రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (1) మాత్రం విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్ త్రివేది (14).. మిడిలార్డర్‌లో విహాన్ మల్హోత్రా (10) నిరాశపరిచారు.
ఇలాంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 99 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.
రాణించిన బౌలింగ్ ఆల్‌రౌండర్లు
అభిజ్ఞాన్‌కు తోడుగా బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆర్‌ఎస్ అంబరీష్ (48), కనిష్క్ చౌహాన్ (45 నాటౌట్) రాణించారు. మిగిలిన వారిలో హర్‌వన్ష్ పంగాలియా (19) విఫలం కాగా.. ఖిలాన్ పటేల్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన భారత అండర్-19 జట్టు 295 పరుగులు సాధించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్‌డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో హెనిల్ పటేల్ ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ఓపెనర్ బెన్ డాకిన్స్ (8)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.
థామస్ ధనాధన్
ఇక ఖిలాన్ పటేల్.. మరో ఓపెనర్ జోసఫ్ మూర్స్ (46), వన్‌డౌన్ బ్యాటర్ బెన్ మేయస్ (34) వికెట్లు తీసుకున్నాడు. అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ థామస్ ర్యూ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 66 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇంగ్లండ్ గెలుపు
మరో ఎండ్ నుంచి కెలెబ్ ఫాల్కనర్ (29 నాటౌట్) థామస్‌కు సహకారం అందించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి (DLS) ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్ణయించగా.. 34.3 ఓవర్లలోనే 196 పరుగులు సాధించింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో భారత అండర్-19 జట్టుపై ఇంగ్లండ్ గెలుపొందింది.
చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు


