ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత జట్టు ప్రయాణం ముగిసిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. లార్డ్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 19 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టపోయి 172 పరుగులు సాధించింది. తద్వారా గ్రూప్-‘ఎ’ నుంచి తమతో పాటు సౌతాఫ్రికాను సెమీస్‌కు తీసుకువెళ్లడంతో పాటు.. టీమిండియాను ఎలిమినేట్ చేసింది.
మిగతా జట్లది దూకుడు మంత్రం
కాగా గతేడాది వన్డే ప్రపంచకప్ సాధించిన భారత జట్టు... టీ20 వరల్డ్‌కప్‌లో మాత్రం ఇలా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం అభిమానులకు ఆవేదనను మిగిల్చింది. అయితే మిగతా జట్లన్నీ దూకుడు మంత్రంతో సాగుతున్న తరుణంలో టీమిండియా మాత్రం పాత తరహాకే పెద్దపీట వేస్తూ ఉండటంతో టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది.
మనోళ్లది నత్తనడక
ఈ క్రమంలోనే.... 2024 ప్రపంచకప్‌లోనూ గ్రూప్ దశలోనే వెనుదిరిగిన టీమిండియా... ఈసారి కూడా అదే తరహాలో నాకౌట్‌కు చేరకుండానే ప్రయాణం ముగించింది. గ్రూప్–‘ఎ’లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై విజయాలు సాధించిన భారత జట్టు... ఆ తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
బంగ్లాదేశ్‌పై కూడా కష్టపడి నెగ్గిన హర్మన్‌ప్రీత్ బృందం... కీలక పోరులో పటిష్ట ఆస్ట్రేలియా ముందు నిలవలేకపోయింది. కాలంతో పాటు మారుతున్న వేగాన్ని అందుకోవడంలో టీమిండియా వెనుకబడిందనేది మాత్రం సుస్పష్టం.
పేలవ ఫీల్డింగ్
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి జట్లు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తో పాటు... ఫీల్డింగ్‌పై ప్రధాన దృష్టి పెడుతుంటే... మనవాళ్లు మాత్రం పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంటున్నారు.
సునాయాస క్యాచ్‌లను సైతం అందుకోవడంలో విఫలమవుతున్న మన అమ్మాయిలు ఈ అంశంలో పోటీ జట్లకు చాలా దూరంలో ఉన్నారు. తాజా మ్యాచ్‌లో కీలక దశలో స్మృతి రనౌట్ తీరు కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.
హార్డ్ హిట్టర్‌ల కొరత
అప్పటి వరకు బంతికో పరుగు చొప్పున చేసిన మంధాన... ఇక గేర్ మార్చుతుందేమో అనుకుంటే... సహచరి స్పందించకున్నా పరుగు అందుకొని వికెట్ సమర్పించుకుంది.
డబ్ల్యూపీఎల్, డబ్ల్యూబీబీఎల్ వంటి లీగ్‌లతో మహిళల టీ20ల్లోనూ హిట్టింగ్‌కు ప్రాధాన్యత పెరగగా... టీమిండియాలో అలాంటి హార్డ్ హిట్టర్‌ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా టీమ్ మేనేజ్‌మెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా చూడాలి!
మ్యాచ్ సాగిందిలా..
లండన్‌లో లార్డ్స్ వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ద శతకం (56)తో అదరగొట్టగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు.
వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసింది. అయితే, ఆఖరి ఓవర్లో ఆమె రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఆమె స్థానంలో వచ్చింది. అయితే, రిచా ఒక్క పరుగే చేయగా.. దీప్తి శర్మ నాలుగు పరుగలతో అజేయంగా నిలిచింది.
అద్భుత అర్ధ శతకాలతో..
ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే రేణుకా సింగ్ షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (4)ను స్వల్ప స్కోరుకే వెనక్కి పంపింది. అయితే, బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్డ్ (22) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు.
అయితే, ఎలిస్ పెర్రి (56), ఆష్లే గార్డ్‌నర్ (53 నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో దుమ్మురేపారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జయభేరి మోగించింది. తమతో పాటు గ్రూప్-ఎ నుంచి సౌతాఫ్రికాను సెమీస్‌కు తీసుకువెళ్లింది. ఇక ఆసీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.


