నాకసలు వినపడనే లేదు!.. వదిలెయ్‌! | Smriti Jemimah Rodrigues Involved In Furious Stare IND Score Vs AUS is | Sakshi
Sakshi News home page

రనౌట్‌.. నాకసలు వినపడనే లేదు!.. వదిలెయ్‌!

Jun 28 2026 8:52 PM | Updated on Jun 28 2026 9:28 PM

Smriti Jemimah Rodrigues Involved In Furious Stare IND Score Vs AUS is

PC: X

ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో భారత్‌ మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ దానిని కొనసాగించారు.

స్మృతి 37 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 38 రన్స్‌ రాబట్టగా.. షఫాలీ 26 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 34 పరుగులు చేసింది. జెమీమా 28 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ సాయంతో 34 పరుగులు చేసింది.

25 బంతుల్లోనే
ఇక 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. 27 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 56 పరుగులు రాబట్టింది. జెమీమా ఆఖరి ఓవర్లో రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరగగా.. రిచా ఘోష్‌ ఒక, దీప్తి నాలుగు పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

స్మృతి- జెమీమా మధ్య రనౌట్‌ వివాదం
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌ సందర్భంగా ప్రాణ స్నేహితులైన స్మృతి- జెమీమా మధ్య రనౌట్‌ వివాదం నెలకొంది. భారత ఇన్నింగ్స్‌ పన్నెండో ఓవర్లో జార్జ్‌ వారేహామ్‌ బౌలింగ్‌లో.. మూడో బంతిని జెమీమా షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైంది.

అయితే, జెమీమా రన్‌కు పిలవకుండానే మరో ఎండ్‌లో ఉన్న స్మృతి పరుగు కోసం వచ్చింది. అయితే, బంతి ఎంతో దూరం వెళ్లలేదు. దీంతో జెమీమా క్రీజులోనే ఉండగా.. స్మృతికి  వెనక్కి వెళ్లే సమయం లేకపోయింది. ఇంతలో ఆసీస్‌ ఫీల్డర్‌ బంతిని వికెట్లకు గిరాటేయగా.. స్మృతి మంధాన రనౌట్‌ అయింది.

ఈ క్రమంలో జెమీమా.. ‘‘నాకసలు వినపడనే లేదు. నువ్వు సింగిల్‌కు పిలిచావా?’’ అన్నట్లుగా సైగలు చేసింది. ఇందుకు స్మృతి.. ‘‘సర్లే వదిలెయ్‌.. లైట్‌ తీస్కో’’ అన్నట్లుగా రియాక్షన్‌ ఇస్తూ పెవిలియన్‌కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement