‘ఆ సంతోషాన్ని చెడగొట్టేందుకు సిద్ధంగానే ఉన్నాము’ | Ready to spoil Party: Ireland Captain Warning To Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

‘ఆ సంతోషాన్ని చెడగొట్టేందుకు సిద్ధంగానే ఉన్నాము’

Jun 26 2026 1:28 PM | Updated on Jun 26 2026 2:11 PM

Ready to spoil Party: Ireland Captain Warning To Vaibhav Sooryavanshi

PC: X

టీమిండియా- ఐర్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌ నేపథ్యంలో కళ్లన్నీ భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీపైనే ఉన్నాయి. బెల్‌ఫాస్ట్‌ వేదికగా శుక్రవారం ఈ చిచ్చర పిడుగు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, వైభవ్‌ కోసం ఎవరిని తప్పించాలో తెలియడం లేదంటూ టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ బాంబు పేల్చాడు. దీంతో మ్యాచ్‌ మొదలైనపుడే వైభవ్‌ అరంగేట్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఐర్లాండ్‌ కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ వైభవ్‌ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

నిజంగా నమ్మలేని విషయం
మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియాలో ఉండటం నిజంగా నమ్మలేని విషయం. ఇక ముందు కూడా ఇది సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. నిజానికి వైభవ్‌ సూర్యవంశీకి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే.

ఇదొక గొప్ప రోజు
అతడొక ప్రత్యేకమైన ఆటగాడు. ఈ వారంలోనే అతడు మాపై అరంగేట్రం చేయవచ్చు. అతడి కెరీర్‌లోనే ఇదొక గొప్ప రోజు అవుతుంది’’ అని టక్కర్‌ వైభవ్‌ను కొనియాడాడు. అయితే, అదే సమయంలో..  ‘‘వైభవ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపి అతడి సంతోషాన్ని చెడగొట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. 

ఐర్లాండ్‌లో కూడా వైభవ్‌ సూర్యవంశీ ఎంట్రీపై భారీ అంచనాలు, హైప్‌ ఉన్నాయి. నిజంగానే అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న బ్యాటర్‌. ఐపీఎల్‌లో సంచలనం సృష్టించాడు. 

పరిశోధనలు చేశాము
అయితే, అతడిని ఎలా త్వరగా అవుట్‌ చేయగలమన్న అంశం గురించి మేము చేయాల్సినన్ని పరిశోధనలు చేశాము. సానుకూల ఫలితం రాబట్టేందుకు కృషి చేస్తాం’’ అని వైభవ్‌కు టక్కర్‌ హెచ్చరికలు జారీ చేశాడు. 

కాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్‌ సూర్యవంశీ పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్‌ క్యాప్‌ అందుకుని చరిత్ర సృష్టించాడు.

ఇక ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్‌ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్‌ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.  

చదవండి: శ్రీలంకతో టెస్టు.. శతకానికి చేరువలో భారత కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement