వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం. పదిహేనేళ్ల వయసులోనే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ చిచ్చరపిడుగు.. ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు.
బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే?
ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి తొలి టీ20 మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెడతాడా? లేదంటే బెంచ్‌కే పరిమితమవుతాడా? అన్న చర్చ మొదలైంది. ఐర్లాండ్‌తో మ్యాచ్ కాబట్టి వైభవ్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
బెల్‌ఫాస్ట్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. వైభవ్ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగించాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానుసారమే తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.
వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము
‘‘ఈ విషయంలో మా కెప్టెన్, హెడ్‌కోచ్‌దే తుది నిర్ణయం. ఒకవేళ వైభవ్ ఆడితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకవేళ అతడు ఆడకపోయినా నాకు గొప్పే. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అతడు టీమిండియాకు ఎంపికయ్యాడు కదా!
వైభవ్‌కు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే, కేవలం అతడిని ఆడించేందుకు ఇప్పటికే పరుగులు రాబడుతూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లను తప్పించలేము కదా!.. అలా చేయడం కూడా సరికాదు.
ఒకరికి అవకాశం ఇచ్చేందుకు బాగా ఆడుతున్న మరొక ఆటగాడిని బలి చేయడం అన్యాయమే అవుతుంది’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, భారత టీ20 జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ ఓపెనర్లుగా పాతుకుపోయారు.
ఆడతాడా? లేదా?
కొన్నిసార్లు అభిషేక్ విఫలమైనా యాజమాన్యం అతడిని కొనసాగించింది. కానీ సంజూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మాత్రం చాలాసార్లు మార్చడమే కాకుండా.. కొన్నిసార్లు అతడిని పక్కనపెట్టింది కూడా!.. అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో నాకౌట్ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ.. వరుసగా 94*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.
తద్వారా భారత్ ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫర్వాలేదనిపించాడు. దీంతో గతంలో మాదిరి సంజూను తప్పించేందుకు ఆస్కారం లేదు. ఇక వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ ప్రపంచకప్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతడిపైనా వేటు పడదు.
దీంతో వైభవ్‌కు టాపార్డర్‌లో చోటు దక్కదు కాబట్టి.. ఇప్పట్లో అరంగేట్రం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఐర్లాండ్‌తో సిరీస్‌కు అంతటి ప్రాధాన్యం లేదు కాబట్టి వైభవ్‌ను ఆడించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇలా అయితే..
కాగా ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేలకూ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కాబట్టి అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతినిచ్చి.. సంజూను వన్‌డౌన్‌కు డిమోట్ చేసి.. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశాలనూ కొట్టిపారేయలేము.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత్- ‘ఎ’ జట్టును విజేతగా నిలిపాడు.


