ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు లభించకపోవడంపై విమర్శలు వచ్చాయి. వైభవ్ నిన్నటి మ్యాచ్‌లో ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాది ప్రత్యర్థిపై ఒత్తడి పెట్టే ప్రయత్నం చేసేవాడని కొంతమంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కాలంటే ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకం.
ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనర్‌గానే ఆడే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వైభవ్ కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ 321 పరుగులు సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్‌తో తొలి టీ20లో మాత్రం శాంసన్ విఫలమయ్యాడు.
నాలుగు బంతులెదుర్కొన్న శాంసన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమే గాక తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలంటే మాత్రం ఇషాన్ కిషన్‌ను తప్పించడమే తొలి మార్గం.
ఎందుకంటే అభిషేక్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ వస్తే, సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. అంతేకాదు శాంసన్ మూడో స్థానంలో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఐపీఎల్‌లో మూడో స్థానంలో 94 మ్యాచ్‌ల్లో 143 స్ట్రైక్‌రేట్‌తో 3,096 పరుగులు సాధించాడు. శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను జట్టులో ఉంచాలనుకుంటే ఆఖరి ఆప్షన్ మాత్రం తిలక్ వర్మే. అయితే తిలక్ వర్మ ఎక్కువగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు.
నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే టీ20 ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో తిలక్ వర్మ 209 పరుగులు సాధించిన తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇన్ని బేరీజులు వేసుకున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో రెండో టీ20లో మాత్రం ఆడే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.


