
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్‌గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్‌గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్‌గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..
ఆసియా కప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్‌ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు.
.. ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్‌కాస్ట్‌లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.
అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్‌లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి.
ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్‌కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం!