
ఆసియాకప్-2025ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ను భారత్ ముద్దాడింది. ఈ విజయంలో భారత టాపార్డర్ బ్యాటర్ తిలక్ వర్మది కీలక పాత్ర.
147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తమ మార్క్ చూపించలేకపోయారు. ఈ సమయంలో తిలక్ వర్మ(69) జట్టు బాధ్యతను తన భుజానపై వేసుకున్నాడు.
ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. దీంతో తిలక్ వర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన తిలక్ వర్మను అశూ ప్రశంచాడు. ఈ లెజెండరీ స్పిన్నర్ సెటైరికల్‌గా పాకిస్తాన్ పేసర్ హరిస్ రౌఫ్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.
భారత్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో రవూఫ్ తన ఓవరాక్షన్‌తో వార్తల్లో నిలిచాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు కోహ్లి, కోహ్లి అని అరవగా.. రవూఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఫైటర్ జెట్‌లను కూల్చేశామని సైగలు చేశాడు.
దీంతో అతడిపై భారత అభిమానులు ఫైరయ్యారు. ఫైనల్లో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అతడిని ఉతికారేశారు. అతడు ఓకే ఓవర్‌లో ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. అతడు కేవలం 3.4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి పాక్ ఓటమికి, భారత్ గెలుపునకు పరోక్షంగా కారణమయ్యాడు. ఈ కారణంతోనే అతడికి అశ్విన్ ధన్యవాదాలు తెలిపాడు.
"తిలక్ వర్మ తన అద్బుతమైన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో అతడు తన పరిపక్వతను చూపించాడు. తిలక్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంతచెప్పుకొన్న తక్కువే. తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకుని ఆడాడు.
స్పిన్నర్లను కూడా అద్బుతంగా ఎదుర్కొన్నాడు. అదేవిధంగా హారిస్ రవూఫ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అతడి బౌలింగ్ వల్లే మేము సునాయసంగా మ్యాచ్‌ను గెలిచాము. తిలక్ వికెట్ పై బౌన్స్ కొంచెం ఉందని గ్రహించి స్క్వేర్ గా ఆడటం ప్రారంభించాడు. అతడి షాట్ సెలక్షన్ కూడా బాగుంది.
హరిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్‌లో తిలక్ వర్మ కొట్టిన సిక్స్ చాలా సులభం అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ షాట్ ఆడటం చాలా కష్టం. లైన్ లో పడిన బంతిని పిక్ చేయడం అంత సులువు కాదు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు కూడా బాగా బౌలింగ్ చేశారు. వారి కమ్‌బ్యాక్ వల్లే పాక్‌ను 150 పరుగులు లోపు కట్టడి చేయగలిగాము" అని తన యూట్యూబ్ ఛానెల్ అశ్విన్ పేర్కొన్నాడు.