టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వార్షిక వేతనంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడుతున్న కారణంగా సెంట్రల్ కాంట్రాక్టులో అతడిని అత్యుత్తమ గ్రేడ్‌లోనే కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చాయి.
ఏటా రూ. 7 కోట్లు
కాగా జాతీయ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను క్రమబద్దీకరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లను ఎ+, ఎ, బి, సి అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులు చెల్లిస్తున్న బోర్డు... ఇక మీద ‘ఎ+’ కేటగిరీని తొలగించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ‘ఎ+’ కేటగిరీలో ఉండగా... వీరికి ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తున్నారు.
రో-కోలతో పాటు జడ్డూను తొలగిస్తారు!
మరోవైపు.. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 కోట్లు... ‘బి’ కేటగిరీలోని ప్లేయర్లకు రూ. 3 కోట్లు... ‘సి’ కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అయితే కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మరోవైపు.. టీ20లకు స్వస్తి పలికిన జడేజా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌లలోనే ఆడుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఎ+ గ్రేడ్‌లో ఉన్న బుమ్రా ఒక్కడే అన్ని ఫార్మాట్‌లలో కొనసాగుతున్నాడు. దీంతో 2025–26 కోసం ప్రకటించనున్న జాబితాలో ‘ఎ+’ కేటగిరీని తొలగించాలని బోర్డు భావిస్తోంది.
బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!
అయితే బుమ్రాకు ఇస్తున్న వేతనంలో ఎలాంటి మార్పు చేసే అవకాశాలైతే లేవు. 2018 సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ‘ఎ+’ జాబితాను ప్రవేశపెట్టింది. కోహ్లి, రోహిత్ ఒక్క ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండటంతో వారికి ‘బి’ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇక ప్రస్తుతం ‘బి’ కేటగిరీలో ఉన్న అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి.
త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొత్త కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘కాంట్రాక్టుల విధానాన్ని సరళీకరించే ప్రయత్నమే ఇది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్‌లు ఆడుతున్న ఆటగాళ్లు తక్కువ మందే ఉన్నారు.
మూడు ఫార్మాట్లు ఆడుతున్న బుమ్రా అత్యుత్తమ కేటగిరీలోనే ఉంటాడు. అతడి వేతనంలో ఎలాంటి కోత ఉండదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా ఇప్పటికే పలు కీలక మ్యాచ్‌లు.. టోర్నీలకు దూరమయ్యాడు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రాధాన్యం దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: భారత్‌లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్


