అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ! | Lionel Messi Explained About Crying After Hat Trick Goals Vs Algeria FIFA WC, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ, ఎందుకంటే?

Jun 17 2026 11:17 AM | Updated on Jun 17 2026 12:28 PM

Messi Explained About Crying After-Hat-trick Goals Vs Algeria FIFA WC

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో అర్జెంటీనా శుభారంభం చేసిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్‌-జెలో బుధ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తుగా ఓడించింది. కెప్టెన్‌గా జ‌ట్టును న‌డిపించ‌డ‌మే గాక హ్యాట్రిక్ గోల్స్‌తో ఒంటిచేత్తో అర్జెంటీనాకు విజ‌యాన్ని అందించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. 

అయితే తొలి గోల్ కొట్టిన స‌మ‌యంలో మెస్సీ ఎమోష‌న‌ల్ అవ్వ‌డం కెమెరా కంటికి చిక్కింది. ఇది చూసిన అత‌డి అభిమానులు మెస్సీ ఎందుకు ఏడ్చాడో అర్థంగాక ఆందోళ‌న చెందారు. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత మెస్సీ త‌న కంట‌త‌డికి కార‌ణం వివ‌రించాడు. అల్జీరియాతో మ్యాచ్‌కు ముందు తాను క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నానని, గోల్ కొట్టిన సంతోషంలో ఒక్క‌సారిగా ఏడుపు వ‌చ్చేసింద‌ని తెలిపాడు. అయితే త‌న భావోద్వేగంతో మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నాడు. మెస్సీ మాట్లాడుతూ.. ‘నా కంట‌త‌డికి మ్యాచ్‌తో సంబంధం లేదు. అయితే దీనికి ముందు కొన్ని క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొన్నా. 

మ్యాచ్‌లో నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతోషంగా ఉన్నా. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి మ్యాచ్‌లోనే  హ్యాట్రిక్ గోల్స్‌తో మెరుస్తాన‌ని ఊహించ‌లేదు. మ్యాచ్ స‌మ‌యంలో నా స‌హ‌చ‌రులు అండ‌గా నిలిచారు. స‌రైన స‌మ‌యంలో పాస్‌లు అందించి గోల్స్ చేయ‌డంలో స‌హ‌క‌రించారు. ఈ విజ‌యం నా ఒక్క‌డిది ఎంత‌మాత్రం కాదు. జ‌ట్టు అంతా క‌లిసి ఆడాం. 

రాబోయే మ్యాచ్‌ల్లోనే ఇదే ప్ర‌ద‌ర్శ‌నను పున‌రావృతం చేయాల‌ని ఆశిస్తున్నా. రికార్డుల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను. ఇవాళ నాది రికార్డు కావొచ్చు.. కానీ రేపు అన్న రోజు నా రికార్డును వేరేవాళ్లు బ‌ద్ద‌లు కొడుతారు. మాకు అన్ని వేళ‌ల అండ‌గా నిలుస్తూ వ‌స్తోన్న కోచ్ లియోన‌ల్ స్క‌లోనికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు' అని చెప్పుకొచ్చాడు.

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్పుల్లో మెస్సీకి ఇది 16వ గోల్ కావ‌డం విశేషం. త‌ద్వారా ఫిఫా చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో మెస్సీ జ‌ర్మ‌నీ దిగ్గ‌జం మిరోస్లావ్ క్లోజ్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. మ‌రో గోల్ కొడితే మెస్సీ క్లోజ్‌ను దాటి టాప్ స్థానాన్ని కైవ‌సం చేసుకోనున్నాడు. త‌ర్వాతి మ్యాచ్‌లోనే ఆ అద్భుతాన్ని చూసే అవ‌కాశం మ‌న‌కు క‌ల‌గ‌నుంది.

 

Read: మెస్సీ ఖాతాలో అత్యధిక గోల్స్‌.. గంటల వ్యవధిలో ఎంబాపెకు చెక్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement