మూడో టెస్టులో 160 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
నాటింగ్‌హామ్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన న్యూజిలాండ్ తమ టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనతను సాధించింది. సోమవారం మగిసిన మూడో టెస్టులో టామ్ లాథమ్ సారథ్యంలోని కివీస్ 160 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 టెస్టుల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 103/4తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 51.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
సోమవారం 36.2 ఓవర్లు ఆడిన జట్టు మరో 109 పరుగులే జత చేసి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. జేమీ స్మిత్ (60) అర్ధసెంచరీ సాధించగా...ఇతర ప్రధాన బ్యాటర్లు రూట్ (18), ఎమీలియో గే (10) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో ఫోక్స్ 3 వికెట్లు పడగొట్టగా ...సాంట్నర్, స్మిత్ చెరో 2 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ గడ్డపై న్యూజి లాండ్ టెస్టు సిరీస్ గెలవడం ఇది నాలుగోసారి. గతంలో ఆ జట్టు 1986, 1999, 2021లలో ఇక్కడ సిరీస్ విజేతగా నిలిచింది.
బెన్ స్టోక్స్ రిటైర్...
దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. ఇంతకుముందే టి20లు, వన్డేల నుంచి తప్పుకున్న 35 ఏళ్ల స్టోక్స్ ఇప్పుడు టెస్టు క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. గత ఏడాది కాలంలో జట్టుకు వరుస పరాజయాలు, తన పేలవ ప్రదర్శనతో పాటు క్రమశిక్షణాచర్యలు ఎదుర్కోవడంతో అతను ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.
122 టెస్టుల్లో 7273 పరుగులు చేయడంతో పాటు 252 వికెట్లు కూడా తీసిన స్టోక్స్ అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని సారథ్యంలో 44 టెస్టులు ఆడిన ఇంగ్లండ్... 24 గెలిచి, 18 మ్యాచ్‌ల్లో ఓడింది. దక్షిణాఫ్రికాపై ఆడిన 258 పరుగుల ఇన్నింగ్స్, ఆ్రస్టేలియాపై హెడింగ్లీ మైదానంలో అసాధారణంగా ఆడి గెలిపించిన 135 నాటౌట్ ఇన్నింగ్స్ అతని బ్యాటింగ్ కెరీర్‌లో హైలైట్‌గా నిలిచాయి.


