Pic Credit: BCCI
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు శ్రీలంక-ఏ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి కారణంగా ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి శుభారంభం చేసిన ఇండియా-ఏ ఆ తర్వాత అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసింది.
ఇక సోమవారం లంకతో జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా నడుమ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలై రెండో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి ఒక మ్యాచ్‌లో గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
ఆఫ్గన్‌పై గెలిచినా..
బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్‌లో గెలవడమే కాదు భారీ రన్‌రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్‌పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి.
కీలకం కానున్న నెట్ రన్‌రేట్
అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. ఈ రెండు జట్లలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే ప్రస్తుతం రన్‌రేట్ విషయంలో అఫ్గానిస్తాన్ (-1.392)తో పోలిస్తే ఇండియా-ఏ (+0.330)ది పైచేయిగా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ లంకతో చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు వెళ్లే అవకాశముంది. కాబట్టి ఆఫ్గన్‌కు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే వారిపై భారీ తేడాతో గెలవడం ఇప్పుడు ఇండియా-ఏ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం.
అయితే శ్రీలంకతో మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. లోయర్ ఆర్డర్‌లో సూర్యాన్ష్ హెగ్డె, విప్రజ్ నిగమ్‌లు ఆడకపోయుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. శ్రీలంకతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్‌కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.
అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 పరుగులు చేయగా, భారత్ 9 పరుగులకే పరిమితమయ్యి ఓటమి చవిచూసింది.


