రేపే భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. ఫెవరెట్‌గా గబ్బర్‌ సేన! | Sunday-High-Voltage Clash-IND Vs PAK-Asian Legends League Tourney | Sakshi
Sakshi News home page

Asian Legends League: రేపే భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. ఫెవరెట్‌గా గబ్బర్‌ సేన!

Aug 1 2026 7:58 PM | Updated on Aug 1 2026 8:49 PM

Sunday-High-Voltage Clash-IND Vs PAK-Asian Legends League Tourney

Photo Credit: BCCI Twitter

మ్యాచ్ ఏదైనా భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య పోరు అంటే ఆ మ‌జానే వేరుగా ఉంటుంది. ఇప్పుడంటే ఎక్కువ‌గా వ‌న్‌సైడ్ ఫ‌లితాలు వ‌స్తున్నాయి కానీ ద‌శాబ్దం కింద‌ట టీమిండియా, పాకిస్తాన్‌లు త‌ల‌ప‌డుతున్నాయంటే ఎంతో థ్రిల్లింగ్ ఉండేది. ఆఖ‌రి దాకా నువ్వా నేనా అన్న‌ట్లుగా మ్యాచ్‌లు సాగేవి. తాజాగా భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అదేంటి.. ఇప్పుడు ఎలాంటి ఐసీసీ మేజ‌ర్ టోర్నీలు జ‌ర‌గ‌డం లేదు క‌దా? చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మధ్య  మ్యాచ్ అంటారేంటి అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఆగస్టు 2) భార‌త్‌, పాకిస్తాన్ త‌ల‌ప‌డుతున్నాయి. ఇండియన్ రాయల్స్, పాకిస్థాన్ పాంథర్స్ జట్ల మధ్య జరిగే ఈ ఆరో మ్యాచ్ జాంబియాలోని లుసాకా నగరంలో ఉన్న లోటస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ హై-వోల్టేజ్ పోరు సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఇండియన్ రాయల్స్ జట్టును మాజీ ఆట‌గాడు శిఖర్ ధావన్ న‌డిపించ‌నుండ‌గా.. దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, అంబటి రాయుడు, రిషి ధావన్, స్టువర్ట్ బిన్ని వంటి స్టార్ ఆటగాళ్లతో బ‌లంగా క‌నిపిస్తోంది. ఇక‌ తమ తొలి మ్యాచ్‌లో గ‌బ్బ‌ర్ సేన‌ బంగ్లాదేశ్ టైగర్స్ జట్టును 19 పరుగుల తేడాతో ఓడించి మంచి ఫామ్‌లో ఉంది. 

మరోవైపు.. మహమ్మద్ హఫీజ్ సారథ్యంలో ఉమర్ అక్మల్, షోయబ్ మాలిక్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, స‌యీద్ అజ్మల్ వంటి వెటరన్ ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ పాంథర్స్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో ఏషియన్ స్టార్స్ చేతిలో 85 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. దీంతో మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఫెవ‌రెట్‌గా క‌నిపిస్తోంది. 

ఆసియా ఖండానికి చెందిన రిటైర్డ్ దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న ఎషియన్ లెజెండ్స్ లీగ్ సీజన్-2 జూలై 30న ప్రారంభమై ఆగస్టు 10న ముగియనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 19 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది జరిగిన తొలి సీజన్‌లో భారత్ ఫైనల్ చేరుకుని రన్నరప్ నిలిచింది. మొత్తంగా మ్యాచ్‌లు లేక జుట్టు పీక్కుంటున్న క్రికెట్‌ అభిమానులకు భార‌త్‌, పాక్ పోరు ఫుల్ మీల్స్ అందించ‌నుంది.

Read: మేరీ కోమ్‌ స్ఫూర్తి.. కామన్‌వెల్త్‌లో పాకిస్తాన్‌కు తొలి పతకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement